Bandi Sanjay: బండి సంజయ్‌కు రిమాండ్‌.. కరీంనగర్‌ జైలుకు తరలింపు

4 Jan, 2022 03:26 IST|Sakshi

సాక్షి కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు కరీంనగర్‌ కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా ఈ నెల 17 వరకు రిమాండ్‌ విధిస్తున్నట్టు పేర్కొంది. దీంతో ఆ ఐదుగురిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఉద్యోగ బదిలీలకు సంబంధించిన 317 జీవోను సవరించాలని ఆదివారం సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.

ఆదివారం రాత్రి 10 గంటల తరువాత ఎంపీ కార్యాలయం బద్దలు కొట్టి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్‌ శివారులోని మానకొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆయన అక్కడే దీక్షకు దిగారు. సోమవారం ఉదయం అక్కడి నుంచి కరీంనగర్‌లోని కమిషనరేట్‌ కమాండ్‌ సెంటర్‌ (సీటీసీ)కు సంజయ్‌ను తరలించారు. మధ్యాహ్నం 1.45 తరువాత కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా సంజయ్‌పై గతంలోని కేసులను చూపించడాన్ని ఆయన తరఫు లాయర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. కాగా, సంజయ్‌ తరఫు న్యాయవాదులు నేడు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశముంది.  

సీటీసీ దగ్గర ఉద్రిక్తత 
సంజయ్‌ సీటీసీలో ఉన్నారని తెలుసుకొని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కరీంనగర్‌ సీపీ సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టారు. కొందరిని అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్‌ హైవేపై కాసేపు వాహనాలు నిలిచిపోయాయి.  

దగ్గరుండి పర్యవేక్షించిన ఐజీ నాగిరెడ్డి 
కోవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘన, పోలీసులపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించినందుకే ఎంపీ సంజయ్‌తో కలిపి మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని మీడియాతో సీపీ సత్యనారాయణ చెప్పారు. ఏ పార్టీ వారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే హైకోర్టు, కేంద్ర–రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, సంజయ్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఆదివారం రాత్రి నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి కరీంనగర్‌ చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పరిణామాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు.  

16 మంది నిందితులు 
ఈ కేసులో మొత్తం 16 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో ఏ1గా ఎంపీ సంజయ్, ఏ3 పెద్దపల్లి జితేందర్, ఏ8 పుప్పాల రఘు, ఏ11 కచ్చు రవి కార్పొరేటర్, ఏ13 మర్రి సతీశ్‌లను జిల్లా జైలుకు తరలించారు. ఏ2 గంగాడి కృష్ణారెడ్డి, ఏ4 ఉప్పరపల్లి శ్రీనివాస్, ఏ5 వాసుదేవ్, ఏ6 రాపర్తి ప్రసాద్, ఏ7 అజ్మీరా హరినాయక్, ఏ9 శీలం శ్రీనివాస్, ఏ10 బొడిగె శోభ, ఏ12 బోయినపల్లి ప్రవీణ్‌రావు, ఏ14 దుబ్బాల శ్రీను, ఏ15 శ్రీకాంత్‌ నాయక్, ఏ16 కటకం లోకేశ్‌ పరారీలో ఉన్నారని రిమాండ్‌ షీట్‌లో తెలిపారు. 

బండిపై పెట్టిన సెక్షన్లు ఇవే! 
ఐపీసీ 147: అల్లర్లు చేసినందుకు (బెయిలబుల్‌), ఐపీసీ 188: విధులను అడ్డుకున్నందుకు (బెయిలబుల్‌), ఐపీసీ 341: విధులను అడ్డుకున్నందుకు (బెయిలబుల్‌), ఐపీసీ 149: అనధికారికంగా గుమిగూడినందుకు, ఐపీసీ 51(బి) డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కేసులు నమోదు చేశారు. సంజయ్‌పై 2012లో ఒకటి, 2017లో రెండు, 2018లో మూడు, 2019లో మూడు కేసులు ఉన్నాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.  

రిమాండ్‌ రిపోర్టులో ఏముందంటే? 
‘కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో ర్యాలీలు, అనధికార, రాజకీయ, బహిరంగ సమావేశాలకు అనుమతి లేకున్నా చైతన్యపురిలోని ఎంపీ కార్యాయంలో సజయ్‌ దీక్షను చేపట్టారు. ఆయనకు మద్దతుగా వందలాది మంది కార్యకర్తలు వచ్చి గుమిగూడారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉండగా దీక్ష వద్దని సమాచారమిచ్చాం. అయితే సంజయ్‌ అనుచరుల్లో కొందరు పోలీసు వాహనాన్ని (టీఎస్‌ 09 పీఏ 3738)ను ధ్వంసం చేసి దాదాపు రూ. 20 వేలు నష్టం కలిగించారు. అరెస్టు సమయంలో పోలీసులను కొట్టి కుర్చీలతో దాడికి దిగారు’అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు