కేసీఆర్‌ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి

6 Oct, 2021 02:21 IST|Sakshi

తక్షణమే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి

డిచ్‌పల్లి నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

సాక్షి, నిజామాబాద్‌: సచివాలయానికి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్, పాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మంగళవారం షర్మిల నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. ముందుగా సమీపంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఎదుట విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం ఆమె దీక్ష శిబిరానికి చేరుకున్నారు.

శిబిరంలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందరూ కష్టపడితేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అయితే సబ్బండ వర్ణాల కష్టంతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ అమలు కేసీఆర్‌ పాలనలో అంతంతమాత్రమే అయిందన్నారు. నిజాం షుగర్స్‌ను తెరిపించే విషయంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు.

కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగం ఏడు రెట్లు పెరిగిందని, పీజీలు చదివిన యువత హమాలీ పనులు చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను నిరుద్యోగ, ఆత్మహత్యల, బీర్లు, బార్ల తెలంగాణగా తయారు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారని, ప్రభుత్వం తక్షణమే 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఉన్న 67 శాతం ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్, కేటీఆర్‌కు రూ.2 కోట్లు ఇచ్చి ఆ పోస్టు తెచ్చుకున్నారని, అందుకే దానికి మూడింతలు రాబట్టుకునేందుకు బరితెగించి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. రాత్రికి రాత్రే వైస్‌ ఛాన్స్‌లర్‌ 50 ఉద్యోగాలు భర్తీ చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇక హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సంబంధించి 100 మంది ఈజీఎస్‌ క్షేత్ర సహాయకులు నామినేషన్లు వేసేందుకు వెళుతుంటే కేసీఆర్‌ భయపడి వారిని అరెస్టు చేయించారని పేర్కొన్నారు. నిరుద్యోగులు తలుచుకుంటే సర్కారు కూలిపోతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పాట్కూరి తిరుపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏపూరి సోమన్న, బుస్సాపూర్‌ శంకర్, తడక జగదీశ్వర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు