మెస్‌ చార్జీలు రూ.2,500కు పెంచాలి 

6 Dec, 2021 03:37 IST|Sakshi
ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో కృష్ణయ్య

మహాధర్నాలో ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ 

కవాడిగూడ (హైదరాబాద్‌): రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెస్‌ చార్జీలను రూ.1,500 నుంచి రూ.2,500కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌చేశారు. ఆదివారం వందలాది మంది హాస్టల్‌ విద్యార్థులతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం 2008లో నూతన వసతి గృహాలు, కాలేజీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించాలని నిరాహార దీక్ష చేయగా ప్రభుత్వం దిగొచ్చి హామీలు అమలు చేసిందని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకుండా సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు 27 శాతం, ఎమ్మెల్యేలకు 50 శాతం వేతనాలు పెంచడం ఏం ధర్మమని ప్రశ్నించారు.

హాస్టల్‌ విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న అనంతరం రెండేళ్లపాటు ప్రభుత్వం వారికి కోచింగ్‌ ఇప్పించి వసతి కల్పించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంఘాల నేతలు మల్లేశ్‌యాదవ్, దాసు సురేశ్, సతీశ్, నర్సింహగౌడ్, కృష్ణయాదవ్, చంటి ముదిరాజ్, వెంకట్, చరణ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు