రేవంత్‌.. హుజూరాబాద్‌ ఎందుకు వెళ్లడం లేదు?

20 Oct, 2021 03:18 IST|Sakshi

కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నడు.. చేయలేదు: కేటీఆర్‌

రేవంత్‌.. హుజూరాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకో 

కాంగ్రెస్, బీజేపీదే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ 

ఎన్నికల తరువాత ఈటల, వివేక్‌ కాంగ్రెస్‌లోకే.. 

కాంగ్రెస్‌లో భట్టి విక్రమార్క ఒక్కరే మంచి వ్యక్తి 

నవంబర్‌ 15న వరంగల్‌లో భారీ విజయగర్జన సభ 

మీడియా చిట్‌చాట్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న తొలి ఉప ఎన్నికలో తనని తాను నిరూపించుకోవాలి కదా.. మరెందుకు హుజూరాబాద్‌ వెళ్లడం లేదు? తాను పీసీసీ చీఫ్‌ కాగానే కాంగ్రెస్‌ ఏదో అయిందంటున్న రేవంత్‌ హుజూరాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకొని చూపించాలి. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి ఎందుకు చేయలేదు? హుజూరాబాద్‌లో వంద శాతం టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, కాంగ్రెస్‌–బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వంటి పలు అంశాలపై ఆయన వ్యంగాస్త్రాలు విసిరారు. కేటీఆర్‌ చిట్‌చాట్‌ ఆయన మాటల్లోనే

సమయం, సందర్భం ఉంటది.. 
కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి, కేటీఆర్‌ సీఎం అన్నది సోషల్‌ మీడియా సృష్టి. దేనికైనా సమయం, సందర్భం ఉంటది. కేసీఆర్‌కు ఉప రాష్ట్రపతి పదవి అనేది ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ప్రచారం మాత్రమే. నేను వేరే వారిలాగా చిలుక జోస్యం చెప్పలేను.

జానారెడ్డి కన్నా పెద్ద లీడరా?.. 
రాజకీయాల్లో గండరగండడు జానారెడ్డినే నాగార్జునసాగర్‌లో 35 ఏళ్ల పిల్లవాని చేత ఓడించాం. జానారెడ్డి కన్నా ఈటల రాజేందర్‌ పెద్ద నాయకుడు కాదు కదా? ఆయన బీజేపీలో ఎందుకు చేరాడో, బీజేపీ గెలిస్తే ఏం చేస్తదో చెప్తలేడు. ఈటల ఇప్పటికీ బీజేపీని ‘ఓన్‌’చేసుకోలేదు. జై బీజేపీ, జై శ్రీరాం బదులు జై ఈటల అంటున్నడు. బీజేపీలోకి దిగిన తరువాత రొచ్చు అంటొద్దంటే ఎట్ల? 17 ఏళ్లు టీఆర్‌ఎస్‌లో అన్ని పదవులను ఎంజాయ్‌ చేసి బీజేపీలోకి ఎందుకు పోయిండు? హుజూరాబాద్‌లో వెయ్యి నామినేషన్లు వేయిస్తం అన్నవాళ్లు ఎక్కడికి పోయారు? రాజేందర్‌ తన బాధను ప్రపంచం బాధ అనుకుంటున్నడు.

ఏడాది తరువాత ఈటల కాంగ్రెస్‌లోకి పోతడు. వివేక్‌ కూడానట. హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కైంది. అందుకే పెద్దపల్లికి చెందిన ఓ అనామకుడిని కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఏ పార్టీనో తెలియని మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి.. బీజేపీకి ఓటేయమని చెప్తున్నడు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్‌ నుంచి బండి సంజయ్, అరవింద్‌ కూడా మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో గెలిచి రెండు పార్టీల ఉమ్మడి ఎంపీలుగా ఉన్నారు.  

హుజూరాబాద్‌ కోసం దళితబంధు రాలేదు 
రాజేందర్‌ రాజీనామాతో దళితబంధు రాలే. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించిన బడ్జెట్లోనే దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం కింద నిధులు కేటాయించాం. రూ.1.70 లక్షల కోట్ల దళితబంధు పథకాన్ని ఒక్క హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం తెస్తామా? అసలు కేంద్రం నుంచి మీరెన్ని నిధులు తెస్తారో? ఏ పథకాలు తెస్తారో చెప్పండి. బీజేపీకి గత ఎన్నికల్లో 107 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. నేను హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదు. నాగార్జునసాగర్, దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లలేదు. సీఎం కేసీఆర్‌ ప్రచారం ఉండొచ్చు. ఇంకా షెడ్యూల్‌ ఖరారు కాలేదు. టీఆర్‌ఎస్‌ పథకాలను కేంద్రం కాపీ కొట్టి పేరు మార్చి అమలు చేస్తోంది.  

ఆరోగ్యశ్రీ మంచి పథకమని కేసీఆరే అన్నారు.. 
కాంగ్రెస్‌లో భట్టి విక్రమార్క ఒక్కరే మంచి వ్యక్తి. కానీ, ఆ పార్టీలో ఆయనది నడవట్లేదు. గట్టి అక్రమార్కులదే నడుస్తోంది. పార్టీలో గ్రూపులు మా బలం. బహుళ నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో సమస్యలను కూర్చొని పరిష్కరించుకుంటం. మంచి పనులు ఎవరు చేసినా చెప్పుకోవాలి. వైఎస్సార్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని మంచి పథకంగా కేసీఆర్‌ చాలాసార్లు ప్రస్తావించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఓ ప్రక్రియ.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రేవంత్, బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకోలేదు.. అయితే, కేసీఆర్‌ ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కోవిడ్‌ ప్రభావం తగ్గింది. ఇప్పటికే 93శాతం వ్యాక్సినేషన్‌ అయిపోయింది. మరో 15 రోజుల్లో 98 శాతం వరకు పూర్తవుతుంది.  

దళితబంధు ఆగదు.. 
తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయి. కేసీఆర్‌ విజనరీ నేత.. మిగతా పార్టీల నేతలు టెలివిజనరీలు. దళితబంధును ఎవరూ ఆపలేరు. నవంబర్‌ 3 నుంచి యథాతథంగా కొనసాగుతుంది.  

నవంబర్‌ 15న ఆర్టీసీ బస్సులన్నీ వరంగల్‌కే.. 
టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నం. కేసీఆర్‌ను అధ్యక్షుడిగా బలపరుస్తూ ఇప్పటికే 10 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఈనెల 25న ప్లీనరీలో జరుగుతుంది. నవంబర్‌ 15న వరంగల్‌లో విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తం.

ఇందుకోసం 7 వేల ఆర్టీసీ బస్సులను అద్దె చెల్లించి తీసుకుంటున్నం. ప్రజలు ఆ రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్‌ఎస్‌ను తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నం.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు