సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ.. తెలంగాణ విమోచన దినోత్సవాలకు రావాలని ఆహ్వానం

3 Sep, 2022 14:04 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న  తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  కేసీఆర్‌ను గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా రావాలని  ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ కార్యక్రమానికి వస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. ఏడాది పాటు రాష్ట్రమంతా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని, ఇందులో  కేంద్ర ప్రభుత్వం సైతం భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తోతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే , కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి సైతం ఆహ్వానం పంపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచనం తర్వాత కొన్ని జిల్లాలు  కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని, అందుకే మూడు రాష్ట్రాలకు దీనితో సంబంధం ఉందని వివరించారు.

సెప్టెంబర్‌ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
చదవండి: స్టేట్‌.. సెంటర్‌.. సెప్టెంబర్‌ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్‌

మరిన్ని వార్తలు