రేవంత్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకం

27 May, 2022 01:28 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌కు మధుయాష్కీ బహిరంగ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ మూలవిధానాలకు వ్యతిరేకమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, అవి పార్టీకి, రేవంత్‌రెడ్డికి నష్టం చేకూరుస్తాయని తెలిపారు. ఈ మేరకు గురువారం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగలేఖ రాశారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఆ వ్యాఖ్యలపట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని, అన్ని అంశాలను నివృత్తి చేస్తూ వెంటనే వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. దేశ నిర్మాణంలో చరిత్రాత్మక పాత్ర పోషిస్తూ అగ్రకులాలకు, బహుజనులకు, ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ గౌరవించిందని పేర్కొన్నారు.

వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్‌ సభ స్థానాలకుగాను 41 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం 2023లో అధికారం సాధిం చేందుకు దకొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళితవర్గానికి, ప్రచార కమిటీ చైర్మన్‌గా బీసీని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నియమించారని పేర్కొన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్‌పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తిరుగుబాటు చేస్తామని అంటున్నాయని తెలిపారు. రేవంత్‌ మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా, అవమాన పర్చేలా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడికి పర్సనల్, పబ్లిక్‌ అంటూ ఏమీ ఉండదని, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడి మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారని తెలిపారు.    

మరిన్ని వార్తలు