గవర్నర్‌ కోటాలో మండలికి మధుసూదనాచారి 

20 Nov, 2021 01:06 IST|Sakshi

సర్క్యులేషన్‌ పద్ధతిలో కేబినెట్‌ సిఫారసు 

ఆమోదించిన గవర్నర్‌ తమిళిసై 

ఎమ్మెల్యే కోటా కింద ఆరుగురు ఏకగ్రీవం!

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి అభ్యర్థిత్వానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఆమోదముద్ర వేశారు. గవర్నర్‌ కోటాలో మధుసూదనాచారి పేరును రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 16న సర్క్యులేషన్‌ పద్ధతిలో సిఫారసు చేసింది. ఈ కోటాలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫె సర్‌ శ్రీనివాస్‌ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది జూన్‌లో ముగిసింది. ఈ ఖాళీ భర్తీ చేసేందుకు ఆగస్టు 2న పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర కేబినెట్‌ ప్రతిపాదించింది.

అయితే కౌశిక్‌రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉండటంతో ఆ ప్రతిపాదనను గవర్నర్‌ వెనక్కి పంపారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మధుసూదనాచారిని గవర్నర్‌ కోటాలో మండలికి పంపుతారనే ఊహాగానాలు వెలువడగా.. చివరకు అదే నిజమైంది. మధుసూదనాచారి పేరును గవర్నర్‌ కోటాలో ప్రతిపాదిస్తూ కేబినెట్‌ సమావేశంలో కాకుండా మంత్రులకు విడివిడిగా సంబంధిత పత్రాలు సర్క్యులేట్‌ చేశారు. అనంతరం మంత్రుల సంతకాలతో కూడిన సిఫారసును గవర్నర్‌కు సమర్పించారు. 

ఎమ్మెల్యే కోటాలోనే దక్కుతుందనుకున్నా.. 
విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి మండలిలో ప్రాతినిథ్యం కల్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మధుసూదనాచారికి ఎమ్మెల్యే కోటాలోనే అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్యంగా జరిగిన మార్పులు, చేర్పులతో ఆయనను గవర్నర్‌ కోటాలో మండలికి నామినేట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 

22న ఆరుగురి ఎన్నిక ప్రకటన 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ నెల 16న టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్లు వేసిన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, బండా ప్రకాశ్‌ ముదిరాజ్, వెంకట్రామ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

ఈ నెల 17న జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఆరుగురి అభ్యర్థిత్వం చెల్లుబాటు కాగా, స్వతంత్రులుగా నామినేషన్‌ వేసిన ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 22తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో అదే రోజు ఈ ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 

ఆ 12 టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే..! 
స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఈ నెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌కు అత్యధిక మెజారిటీ ఉండటంతో ఈ 12 స్థానాలు కూ డా అధికార పార్టీ ఖాతాలోనే చేరే అవకాశముంది.

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ కసర త్తు చేస్తుండగా ఈ నెల 22 లేదా 23 తేదీల్లో జాబితా ప్రక టించే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రి య ముగియనుంది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత శాస న మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక, మంత్రివర్గ వి స్తరణ వంటి అంశాలు తెరమీదకు వచ్చే అవకాశముంది.    

మరిన్ని వార్తలు