మేధావులు, క్యారెక్టర్‌ ఉన్న వారినే పిలుస్తారు 

4 May, 2022 00:34 IST|Sakshi

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

హనుమకొండ: ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పబ్‌ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్‌ గాంధీ నేపాల్‌లోని కఠ్మాండులో పబ్‌లకు వెళతారు.. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెబుతారని అనుకుంటున్నారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఎర్రబెల్లి పైవిధంగా బదులిచ్చారు.

ఓయూలో రాహుల్‌ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలా.. వద్దా.. అనేది ఆ యూనివర్సిటీ చూసుకుంటుందన్నారు. ప్రభుత్వానికి అనుమతితో సంబంధం లేదని స్పష్టంచేశారు. ‘ఓయూకు వచ్చి పబ్‌ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారనే భావన కూడా అనుమతి ఇవ్వకపోవడానికి ఒక కారణం కావొచ్చు. ఎవరు వస్తే విద్యార్థులు బాగుపడతారు.. ఎవరు వస్తే విద్యార్థులు చెడిపోతారు.. అనే అంశాలపై ఓయూ యాజమాన్యం ఆలోచించి ఆహ్వానిస్తుంది. మేధావులు, క్యారెక్టర్‌ ఉన్న వారినే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పిలుస్తారు’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు