రూ. 5 వేల కోట్లు తెచ్చి ఓట్లు అడగండి

31 Aug, 2021 01:26 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో మంత్రి హరీశ్‌రావు 

హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే ఆయనకే లాభం 

గెల్లు శ్రీనివాస్‌ విజయం సాధిస్తే ప్రజలకు లాభం  

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

హుజూరాబాద్‌: బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి హుజూరాబాద్‌ అభివృద్ధికి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని, అప్పుడే ఓట్లు అడగాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తోంది టీఆర్‌ఎస్‌ సర్కారేనని తెలిపారు. అందుకే తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్, వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన పలువురు యువకులు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలనుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్‌ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు అయిందని, వీణవంకలో రూ.10 లక్షల పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే లాభం ఏంటో చెప్పాలని, ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు, బీజేపీకి లాభమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ విజయం సాధిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు లాభమని అన్నారు. ఇదిలా ఉండగా జమ్మికుంటలో కూడా మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలనుంచి దాదాపు 500 మంది నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరకముందే హుజూరాబాద్‌ ప్రాంతం గులాబీ అడ్డాగా ఉండేదని అన్నారు. టీఆర్‌ఎస్‌లోకి ఆయన ఒక్కరే వచ్చారని, ఇప్పుడు కూడా ఒక్కరే బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు