ఎత్తిపోసే పనిలో మేం.. ఎత్తుకెళ్లే పనిలో బీజేపీ!

1 Nov, 2022 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జలాలను ఎత్తిపోసే పనిలో టీఆర్‌ఎస్‌ ఉంటే.. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే పని లో ఉందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటివి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయనే విషయాన్ని బీజేపీ నేతలే పరోక్షంగా అంగీకరిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో దూతలను కోన్‌కిస్కా గాళ్లు అంటూ మాట్లాడిన బీజేపీ.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయించిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు, చేనేతపై జీఎస్టీ విధింపునకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందంటూ బీజేపీ నేతలు పచ్చి అబ ద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో తమ కు సంబంధం లేదనే ఆధారాలను మీడియాకు అందజేశారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ నకిలీ మాటలతో వెకిలి చేష్టలు చేస్తున్నారు, వారిస్థాయి ఏమిటో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఢిల్లీ దూతలే చెప్పారు. చండూరులో టీఆర్‌ఎస్‌ సభ విజయవంతమవడంతో బీజేపీ నాయకుల కు కంటి మీద కునుకులేకుండా పోయింది..’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

బీజేపీ డీఎన్‌ఏలోనే అబద్ధాలు: బీజేపీ డీఎన్‌ఏలోనే పచ్చి అబద్ధాలు ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో ఇతర పార్టీల విలీనాన్ని ప్రస్తావిస్తున్న బీజేపీ.. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరుల విషయంలో చేసిందేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 65లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంలో రూ.30వేల కోట్లు ఇస్తామని తెలంగాణ ఆర్థిక శాఖకు కేంద్రం లేఖ రాసినా సీఎం కేసీఆర్‌ తిరస్కరించారని చెప్పారు. చేనేతపై జీఎస్టీని మినహాయించాలని 2017లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ తరఫున నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ కోరిన విషయాన్ని గుర్తుచేశారు.

మిషన్‌ భగీరథకు రూ.19,200 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా.. కేంద్రం నయాపైసా ఇవ్వలేదన్నారు. ఫ్లోరైడ్‌ నిర్మూలనకు రూ.800 కోట్లు ఇచ్చామని కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మిషన్‌ భగీరథకు రూ.2,350 కోట్లు ఇవ్వాల్సి ఉందని హరీశ్‌రావు చెప్పారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి 20 ఉత్తరాలు రాసినా స్పందన లేదని, మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.

బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలే!
బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదం ఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్‌లో బ్రిడ్జి కూలితే ప్రభుత్వ పతనానికి సంకేతం అంటూ మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇప్పుడు అదే విషయాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.

‘‘బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలు. ప్రజల ప్రాణాలు నీళ్ల పాలు అన్నట్టుగా తయారైంది. సంక్షేమానికి టీఆర్‌ఎస్‌.. సంక్షోభానికి బీజేపీ నిర్వచనంగా మారాయి. మునుగోడు ఎన్నికలో ప్రజలు పాలు, నీళ్లకు తేడాను గుర్తించి ప్రజాస్వామ్య విలువలు పెంచేలా తీర్పునిస్తారన్న నమ్మకం ఉంది’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. హామీలను నిలబెట్టుకోలేకే మునుగోడులో జేపీ నడ్డా సభను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, దేవీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ‘మునుగోడు’ ముంగిటకు సర్కార్‌ను తెచ్చాం

మరిన్ని వార్తలు