ఉద్యోగాలు ఊడగొడుతున్న కేంద్రం

6 Jan, 2023 04:23 IST|Sakshi

బీజేపీపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు.. ఉద్యోగ నోటిఫికేషన్లపై బండి సంజయ్‌ కుట్ర 

కోరుట్ల/పెద్దపల్లి: బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించి ఇప్పటికే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్, బస్తీ దవాఖానా ప్రారంభించి, వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోనూ 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిందని, దీనిపై యువతకు సమాధానం ఇవ్వాలన్నారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుళ్లుకుంటున్నారని అన్నారు.

నోటిఫికేషన్లపై స్టేలు తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కళాశాలలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని, ఇంత అన్యాయం జరిగితే మరి సంజయ్‌ ఏం చేస్తున్నారని హరీశ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు 4 మెడికల్‌ కళాశాలలు ఇస్తే ఎంపీ సంజయ్‌ ఏం తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగా పేదలకు వైద్య సేవలు అందించడంలో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మతం పేరిట యువతను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణతో బీఆర్‌ఎస్‌ పార్టీకి పేగుబంధం ఉందని, ప్రతిపక్షాలది మాత్రం ఓటు బంధమని అన్నారు. 

నిరుద్యోగులకు కేంద్రం వంచన 
దేశంలో నిరుద్యోగం 8.30 శాతానికి పెరగగా, తెలంగాణలో కేవలం 4 శాతమే ఉందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనం వాపస్‌ తెప్పిస్తామని కేంద్రం మోసగించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు, రైతుబీమా, రైతుబంధు ఇస్తూ ఆదుకుంటోందని వెల్లడించారు. హరిత తెలంగాణ దిశగా బీఆర్‌ఎస్‌ చర్యలు తీసుకుంటే బీజేపీ మాత్రం ఉద్రిక్త తెలంగాణ, మతతత్వ తెలంగాణ కావాలన్న రీతిలో వ్యవహరిస్తోందన్నారు.

కరెంట్‌ కోసం రోడెక్కిన రైతులను కాల్చి చంపిన నేతలు ఖమ్మంలో మాట్లాడారని, రైతులకు ఎరువులు ఇవ్వని కాంగ్రెస్‌ పార్టీ అన్నదాతల గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్లు దావ వసంత, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు