విషం తప్ప.. విషయం లేదు

5 Jul, 2022 03:42 IST|Sakshi

బీజేపీ నేతల ప్రసంగాలపై మంత్రి హరీశ్‌ మండిపాటు

నీళ్లు, నిధులు, నియామకాలు చూపిస్తాం రండి..

డబుల్‌ ఇంజన్‌ సర్కార్ల కంటే ఇక్కడే ఎక్కువ అభివృద్ధి

సాక్షి, హైదరాబాద్‌: ‘‘హైదరాబాద్‌ వేదికగా రెండు రోజులపాటు సాగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ నేతలకు నిరాశే మిగిలింది. అధికార యావ, సీఎం కేసీఆర్‌ నామస్మరణ తప్ప ఆ సమావేశాల్లో మరేదీ కనిపించలేదు. బీజేపీ నేతల దగ్గర విషం తప్ప విషయమేమీలేదని మరోమారు రుజువైంది’’అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, రేగ కాంతారావు, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌తో కలసి సోమవారం ఇక్కడి టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఏవేవో మాట్లాడారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాలకు రండి, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో నీళ్లు ఎలా వచ్చాయో చూపిస్తాం. తెలంగాణలో రూ.లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని పరేడ్‌ గ్రౌండ్‌ బహిరంగసభలో ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు.

నీళ్లు రాకపోతే, మరి లక్షల కోట్ల రూపాయల విలువైన ధాన్యం ఎక్కడ నుంచి వచ్చిందో మోదీ చెప్పాలి’అని హరీశ్‌రావు నిలదీశారు. ‘తెలంగాణలో 2014–15లో 68 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం పండగా, గతేడాది 2.60 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని నీతి ఆయోగ్‌ చెప్పింది. కేసీఆర్‌ నిర్విరామ కృషితో గోదావరి, కృష్ణాజలాలు తెలంగాణ బీడుభూములకు మళ్లడంతో సాగు విస్తీర్ణంలో గతేడాది 21 శాతం వృద్ధిరేటు నమోదైంది. అమిత్‌ షా అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానించారు’అని మండిపడ్డారు.

సింగిల్‌ ఇంజిన్‌తోనే అభివృద్ధి “డబుల్‌’
‘తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్‌. తెలంగాణలో నిధులు, నీళ్లు వచ్చాయనేందుకు మా వద్ద అనేక ఆధారాలు ఉన్నాయి. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని సింగిల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఎక్కువ అభివృద్ధి సాధిస్తోంది. తలసరి ఆదాయం, జీడీపీ, జీఎస్‌డీపీ.. ఇలా అన్నింటా తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుంది.

తలసరి ఆదాయంలో ఎనిమిదేళ్లలో పదోస్థానం నుంచి మూడోస్థానానికి చేరుకోవడం మా పనితీరుకు నిదర్శనం. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి పథకాల మీద రూ.11 లక్షల కోట్లు ఖర్చు చేశాం. లబ్ధిదారులను అడిగితే తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్తారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16.50 లక్షల ఉద్యోగాలతోపాటు తాము ఇచ్చినట్లు చెప్తున్న 16 కోట్ల ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు మోదీ వద్ద సమాధానాలు లేనందునే ఏమీ చెప్పలేదు’అని హరీశ్‌ ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు