కేంద్రం ఎగ్గొట్టిన 4వేలకోట్లు తీసుకురండి: హరీశ్

15 Apr, 2022 02:54 IST|Sakshi

సాక్షి,దుబ్బాక టౌన్‌: తెలంగాణకు న్యాయంగా రావాల్సిన రూ.4వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఆరపల్లి, మహ్మద్‌షాపూర్‌ గ్రామాలకు చెందిన‘దళితబంధు’లబ్ధిదారులకు యూనిట్స్‌ను గురువారం దుబ్బాక పట్టణంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ‘బీజేపీ నేతలు బాగా మాట్లాడుతుండ్రు గదా.. ఎమ్మెల్యే రఘునందన్‌రావు గారు ముందుగా ఢిల్లీ నుంచి రావాల్సిన పైసలు తీసుకరండ్రి’అంటూ సూచించారు.

తెలంగాణ ప్రజలు కేంద్రానికి చెల్లించిన పన్నుల వాటానే అడుగుతున్నాం తప్ప.. అడుక్కోవడం లేదన్నారు. బీఆర్‌జీఎఫ్‌ కింద ఏటా ఇవ్వాల్సిన రూ.450కోట్లు మూడేళ్ల నుంచి (రూ.1,350 కోట్లు) ఇవ్వడం లేదని, 15వ ఆర్థిక సంఘానికి చెందిన రూ.763 కోట్లు, 2021–22కు సంబంధించిన అభివృద్ధి నిధులు రూ.1,200 కోట్లు, మొత్తం రూ.4వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు.


 

మరిన్ని వార్తలు