కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం 

27 May, 2022 01:23 IST|Sakshi

సిల్వర్‌ జూబ్లీకి వచ్చి మోదీ చిల్లర మాటలు: మంత్రి హరీశ్‌

నమ్మకానికి మారుపేరు కేసీఆర్‌.. అమ్మకాలకు మారుపేరు మోదీ 

సాక్షి, సిద్దిపేట: ‘కేసీఆర్‌ది కుటుంబ పార్టీ కాదు.. తెలంగాణే ఓ కుటుంబం. తెలంగాణను ఓ కుటుంబంగా భావించి పరిపాలించే నాయకుడు కేసీఆర్‌’ అని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారో చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తుందనేది పగటి కలే. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్‌ మాత్రమే. కుటుంబ రాజకీయాలపై మోదీ మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అడిగినప్పుడు టీఆర్‌ఎస్‌ మంచి పార్టీ. ఆ రోజు కుటుంబ పార్టీ కాదు.

ఈ రోజు టీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీగా మీకు కనబడుతుందా?. అమిత్‌ షా కుమారుడు బీసీసీఐకి సెక్రటరీ అయిండు. ఆయనేమైనా క్రికెటర్‌రా? దీనికి మీ సమాధానం ఏంటి? తమిళనాడులో డీఎంకేతో, ఏపీలో టీడీపీతో, పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తుపెట్టుకున్నారు. అవి కుటుంబ పార్టీలని గుర్తుకు రాలేదా? మీ తప్పులు ఎత్తిచూపితే కుటుంబ పార్టీ అంటారా?’అని హరీశ్‌రావు నిలదీశారు.

‘మోదీ సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌కు వచ్చి చిల్లర మాటలు మాట్లాడిపోయారు.  తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఓట్ల కోసం మతకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో రాష్ట్ర ప్రజలకు మేలైన విషయాలు చెప్తారని ఆశించాం. విభజన చట్టంలోని సమస్యలపై స్పందిస్తారని అనుకున్నాం. కానీ అలాంటిదేమీ జరగలేదు’అని వివరించారు. 

ఆ పరిశ్రమలు ఎక్కడ?.. 
‘విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, డిఫెన్స్‌ కారిడార్, ఐఐఎంలు మంజూరు చేయలేదు. ఐటీఐఆర్, కాళేశ్వరానికి జాతీయ హోదా, మిషన్‌ భగీరథ కోసం నీతిఆయోగ్‌ ఆదేశించిన రూ1,900 కోట్లు, పసుపు బోర్డు, టెక్స్‌టైల్‌ పార్క్‌కు ఒక్క పైసా సాయం చేయకుండా ప్రజలను రెచ్చగొట్టే మాటలు మోదీ మాట్లాడుతున్నారు’అని విమర్శించారు.

గుజరాత్‌ కంటే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో నిధులు రాకుండా మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.  తెలంగాణపై మీకు ప్రేమ ఉంటే కృష్ణా ట్రిబ్యునల్‌ వేసి తెలంగాణ నీటి వాటా తెలంగాణకు ఇవ్వాలని అని డిమాండ్‌ చేశారు.    

మరిన్ని వార్తలు