భవిష్యత్‌లోనూ కలిసే పనిచేస్తాం

9 Nov, 2022 01:54 IST|Sakshi
సీపీఎం కార్యాలయానికి వచ్చిన జగదీశ్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న జూలకంటి రంగారెడ్డి,  తమ్మినేని వీరభద్రం, మల్లు లక్ష్మి 

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతాం: మంత్రి జగదీశ్‌రెడ్డి

కమ్యూనిస్టుల కార్యాలయాలకు వచ్చి కృతజ్ఞతలు  

గవర్నర్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి: తమ్మినేని 

బీజేపీకి ముగింపు కార్డు వేశాం: కూనంనేని 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలతో భవిష్యత్‌లోనూ కలిసే పనిచేస్తామని విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ముసుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం జగదీశ్‌ రెడ్డితోపాటు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీ రవీందర్‌లు సీపీఎం రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌కు వచ్చారు.

వారికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, టి.సాగర్‌ స్వాగతం పలికారు. అనంతరం జగదీశ్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలకు శాలువా కప్పి సన్మానించారు. ఆ తర్వాత వారు పలు అంశాలపై చర్చించారు.

అంతకుముందు జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన సీపీఎం నేతలకు కృతజ్ఞతలు చెప్పడం కోసమే వచ్చానని చెప్పారు. ఈ ఐక్యత ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. మునుగోడు ఫలితం బీజేపీకి చెంపపెట్టులాంటిదన్నారు. ఇక్కడి నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభమవుతుందని చెప్పా రు. వామపక్ష పార్టీలు, నాయకులు చారిత్రక బాధ్యతను నెరవేర్చారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సినవి చేస్తామని పేర్కొన్నారు. వాటిని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీల నాయకులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు.

బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కోరారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, ‘కమ్యూనిస్టుల బలం ప్రస్తుతం తక్కువగా ఉండొచ్చు.. కానీ మా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్‌లోనూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటాం. గవర్నర్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు. తెలంగాణ గవర్నర్‌ వద్ద అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి’అని చెప్పారు. ఏడాది కింద ప్రారంభమైన రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రధాని మోదీ మళ్లీ ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈనెల 12న ప్రధాని మోదీ రామగుండంకు వస్తున్న సందర్భంగా నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. 

సీపీఎం నేతలతో భేటీ 
మంత్రి జగదీశ్‌ రెడ్డి, కూసుకుంట్ల, గ్యాదరి కిశోర్, తక్కలపల్లి రవీందర్‌లు హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాల యం మఖ్దూంభవన్‌లో సీపీఐ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి, ఈ.టి.నర్సింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి, కూసుకుంట్లకు సీపీఐ నేతలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు ఎన్నిక ద్వారా బీజేపీకి ముగింపు కార్డు వేశామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.  

మరిన్ని వార్తలు