ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ పాట్లు: కిషన్‌రెడ్డి

23 Nov, 2021 02:32 IST|Sakshi

సమస్య కాని సమస్యను తెరమీదకు తెచ్చారన్న కేంద్రమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సమస్య కాని సమస్యను సీఎం కేసీఆర్‌ తెరమీదకు తీసుకొచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, మరి రాష్ట్రంలో గత ఏడున్నరేళ్లలో చనిపోయిన, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోరా.. అని ప్రశ్నిం చారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన యువత, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల్లో ఏ ఒక్క కుటుంబాన్ని అయినా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఆదుకుందా అని నిలదీశారు.

సోమవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో నాయకులు దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఎస్‌.కుమార్, ఎస్‌.ప్రకాష్‌రెడ్డి, దీపక్‌రెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండునెలలు హుజూరాబాద్‌ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టారని, వివిధరూపాల్లో ప్రలోభాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడినా బీజేపీ గెలవడంతో ఆయనకు దిమ్మతిరిగిందని ఎద్దేవా చేశారు. ఈ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వడ్ల కొనుగోలు అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు. ఈ విషయంలో పెద్దఎత్తున కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసినా  రైతు లు విశ్వసించడం లేదని చెప్పారు. 

ఒప్పందం మేరకు ప్రతిగింజా కొంటాం.. 
రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ప్రతి ధాన్యం గింజనూ కేంద్రం కొనుగోలు చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్, ప్రగతిభవన్‌లకే పరిమితమైన సీఎం కేసీఆర్‌ ఇందిరాపార్క్‌ దీక్షాశిబిరానికి రైతులపై ప్రేమతో రాలేదని, హుజూరాబాద్‌ తీర్పును తక్కువ చేసి చూపేందుకే వచ్చారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్‌ మార్చ్, సాగరహారం.. ఇలా ఏ ఆందోళనల్లోనూ కేసీఆర్‌ పాల్గొనలేదని, ఇప్పుడేమో లేని సమస్య కోసం ఇందిరాపార్క్‌కు వచ్చారని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినా ఇంకా ధర్నాలు కొనసాగుతున్నాయంటే, దీని వెనక రాజకీయశక్తులు ఉన్నాయా అన్న అనుమానం వ్యక్తమవుతోందని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు.   

దేశవ్యాప్తంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు 
‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా సంక్రాంతి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమ వారం తెలిపారు. అలాగే భారతరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితంతో ముడిపడిన ఐదు స్థలాలను పంచతీర్థలో భాగంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ వర్ధంతి నాడు ఆయన జన్మస్థలం, దీక్షాభూమి, అంతిమశ్వాస విడిచిన ఇల్లు, లండన్‌లోని నివాసం వంటి ప్రదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా 10 లక్షల మంది విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాల్లో స్కాలర్‌షిప్‌ నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. సోషల్‌ మీడియాలోనూ అంబేడ్కర్‌ గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నామని, గ్రామీణులకు అంబేడ్కర్‌ జీవిత విశేషాలు తెలిసేలా ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెస్తామన్నారు.  

మరిన్ని వార్తలు