మోదీజీ.. అదే నిజమైతే మీ చిత్తశుద్ది నిరూపించుకోండి.. రేపిస్టులకు బెయిల్‌ రాకుండా చేయండి: మంత్రి కేటీఆర్‌

17 Aug, 2022 12:52 IST|Sakshi

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ దోషులను.. రెమిషన్‌ ఆదేశాల కింద గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేయడంపై దేశం భగ్గుమంటోంది. గుజరాత్‌ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుండగా.. విపక్షాలు, మేధోవర్గం ఈ విషయంలో గుజరాత్‌ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఏకీపడేస్తున్నాయి. ఈ క్రమంలో.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం ట్విటర్‌ వేదికగా స్పందించారు. 

ప్రియమైన మోదీగారు.. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడడం నిజమే అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోండి. పదకొండు మంది రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్‌ ప్రభుత్వపు ఆదేశాలను రద్దు చేయించండి. ఈ దేశాలు వెగటు పుట్టించేవిగా ఉన్నాయి. మీరు జోక్యం చేసుకుని చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు కేటీఆర్‌. 

అంతేకాదు.. సార్‌.. ఐపీసీ, సీఆర్‌పీసీలో రేపిస్టులకు బెయిల్‌ దొరక్కుండా ఉండేందుకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, బలమైన చట్టాలతోనే న్యాయవ్యవస్థ పటిష్టంగా, వేగంగా పని చేస్తుందని మరో కొనసాగింపు ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్‌.

ఇదీ చదవండి: మోదీ పాతికేళ్ల లక్ష్యాలు భేష్‌..: కేటీఆర్‌

మరిన్ని వార్తలు