రైతుబంధు కావాలా.. రాబందు రాజ్యం కావాలా? నిర్ణయం మీదే..

2 Nov, 2022 01:48 IST|Sakshi

సాక్షి, యాదాద్రి, మునుగోడు: మునుగోడు ఉపఎన్నిక పోరు టీఆర్‌ఎస్, బీజేపీ అభ్య­ర్థుల మధ్య కాదని.. ఇది రెండు భా­వజా­లాల మధ్య జరగనున్న యుద్ధమని మంత్రి కె.తారక­రా­మారావు అన్నారు. రైతు­లను ట్రాక్టర్లతో తొక్కించే ఆ గట్టున (బీజేపీ) ఉంటారో లేక రైతు సంక్షేమాన్ని కోరుతు­న్న సీఎం కేసీఆర్‌ గట్టున ఉంటా­రో మును­గోడు ఓటర్లు తేల్చుకోవాలన్నారు. అలాగే రైతు­బంధు రాజ్యం కావాలో లేక రాబంధు రాజ్యం కావాలో నిర్ణ­యించుకోవాలని ప్రజల­ను కోరారు. ఉపఎన్నిక చివరిరో­జు ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి కేటీఆర్‌ యా­దా­ద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణ­పురం, పుట్టపా­క, నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన రోడ్డు షోలలో ప్రసంగించారు.

ఫ్లోరిన్‌ సమస్య లేకుండా చేశాం..
మునుగోడులో ఫ్లోరిన్‌ సమస్యతో అనేక మంది అనారో­గ్యానికి గురవుతుంటే సీఎం కేసీఆర్‌ చలించి మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేశారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. నేడు నియోజకవర్గంలో ఫ్లోరిన్‌ సమస్య లేకుండా తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురం వద్ద టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటు చేసి త్వరలో 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని చెర్లగూడెం, కిష్టారాయింపల్లి ప్రాజెక్టులను పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. శివన్న­గూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్‌లను పూర్తి చేస్తామని, రాచకొండలో లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని 14 నెలల్లోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

బీజేపీకి డిపాజిట్‌ రాకుండా బుద్ధి చెప్పాలి..
మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 400 ఉండగా ప్రస్తుతం రూ. 1,200కు చేరుకుందని.. భవిష్యత్తులో ఇది రూ. 4 వేలకు పెరిగే ప్రమాదం ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే సంక్షేమం పరుగులు పెడుతుందని, మరిన్ని పథకాలు వస్తాయన్నారు. ‘మనది పేదల ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీది పెద్దల ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంట్‌ను రద్దు చేస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పార్టీకి డిపాజిట్‌ రాకుండా బుద్ధిచెప్పాలి’ అని ప్రజలను మంత్రి కేటీఆర్‌ కోరారు. 

తూతూ ప్రమాణం చేసి డబ్బులు తీసుకోండి..
కేంద్రం ఇచ్చిన రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపొయి రాజ గోపాల్‌రెడ్డి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కేటీఆర్‌ ఆరో పించారు. బీజేపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి రూ. 5 వేల కోట్లకుపైగా వచ్చే లాభంలో రూ. 500 కోట్లు ఖర్చుచేసి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటికి తులం బంగారం చొప్పున ఇచ్చి ఆయనకే ఓటేసేలా రాజ గోపాల్‌రెడ్డి ప్రమాణం చేయించుకోజూస్తారని.. కానీ ఏదో తూతూ ప్రమాణం చేసి ఆ బంగారం, డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీఆర్‌ఎస్‌కే వేయాలని కేటీఆర్‌ కోరారు.
చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు

మరిన్ని వార్తలు