నిజమైన దొర ప్రధాని మోదీనే

1 Jul, 2022 02:58 IST|Sakshi
మంత్రులు, పార్టీ నేతలతో మాట్లాడుతున్న కేటీఆర్‌ 

ఈడీ, సీబీఐలను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన: కేటీఆర్‌ 

ఎనిమిదేళ్లలో 8 ప్రభుత్వాలు కూల్చారు 

రాష్ట్రానికి వచ్చే వారికి పాఠాలు నేర్పుదాం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కాంగ్రెస్, బీజేపీలకు దశాబ్దాల తరబడి అధికారం అప్పగించినా పనిచేయకుండా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలు అభివృద్ధి బాటన సాగుతున్నాయి. రాష్ట్రానికి మోదీ, రాహుల్‌ ఎవరు వచ్చినా అభివృద్ధి, సంక్షేమంతోపాటు పాలన ఎలా చేయాలో పాఠాలు నేర్పి పంపుతాం’’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.

గురువారం కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. దేశంలో నిజమైన దొర ప్రధాని మోదీయే. ఈడీ, సీబీఐలను అడ్డు పెట్టుకుని చేస్తున్న నిరంకుశ పాలనపై మౌనం ప్రమాదకరం. మోదీ ఎనిమిదేళ్ల నిరంకుశ పాలనలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారు..’’అని మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజలకు మోదీ సెల్యూట్‌ చేయాలి 
ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.65లక్షల కోట్లు పన్ను రూపంలో వెళితే తిరిగి వచ్చింది రూ.1.68లక్షల కోట్లు మాత్రమేనని.. మన సొమ్ముతో కులుకుతున్న మోదీ తెలంగాణ ప్రజలకు సెల్యూట్‌ చేయాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తాము కూడా దూషణలకు దిగితే బీజేపీ నేతలకు తాతల్లాగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. తెలంగాణకు టూరిస్టులు వస్తూ పోతూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నా బీజేపీ మత కలహాలతో యువతను ఆగం చేస్తోందన్నారు.

ఆకు సిపాయిలకు అభివృద్ధి చూపుదాం 
హైదరాబాద్‌లో జరిగే బీజేపీ సర్కస్‌లో పచ్చి అబద్ధాలు చెప్పడానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారని కేసీఆర్‌ విమర్శించారు. ‘‘ఆగం చేశాం, పీకేస్తాం, పొడిచేస్తాం అని చెప్పేం దుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. బీజేపీకి చెందిన ఒక్కో సిపాయి నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వస్తున్నారు. ఆ ఆకు సిపాయిలకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు ఇలా అన్నీ చూపండి.

పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించండి..’’అని పార్టీ శ్రేణులకు సూచించారు. వంట గ్యాస్‌ ధరలు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ, జాబ్‌ సెక్యూరిటీ కోరుకుంటున్న యువతను సెక్యూరిటీ గార్డులుగా మార్చే ప్రయత్నాలు వంటివి దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీకి బైబై చెప్పే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. 

టీఆర్‌ఎస్‌ అంటే.. ‘తిరుగులేని రాజకీయ శక్తి’ 
పల్లె నుంచి పట్నం దాకా అభివృద్ధి చేస్తున్నది టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని.. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా ఎన్ని ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను గుండెకు హత్తుకుంటున్నారని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అపరిపక్వతతో మాట్లాడుతున్నారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు