కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోంది

18 Sep, 2022 02:11 IST|Sakshi
దక్షిణ్‌ డైలాగ్స్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో శశిథరూర్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు 

దక్షిణ్‌ డైలాగ్స్‌–2022లో దక్షిణాది రాష్ట్రాల నేతల వ్యాఖ్య

కేంద్రం పెద్దన్న పోకడలు పోతోంది: మంత్రి కేటీఆర్‌

పన్నుల వాటాల్లో దక్షిణాదికి తక్కువ నిధులిస్తోందని ధ్వజం

కేంద్ర, రాష్ట్రాల సంబంధాలను పునర్నిర్వచించాలన్న నేతలు

పన్నుల్లో వాటాలు సహా వివిధ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయం  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దన్న పోకడలు పోతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ‘మేము ఇచ్చేవాళ్లం.. మీరు అందుకొనే వాళ్లు’అనే రీతిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఏ రకమైన కార్యక్రమాలు కావాలో వాటిని ఎలా నిర్వహించాలో కేంద్రం ఎలా నిర్దేశిస్తుందని ప్రశ్నించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి ఎంతమాత్రం సరికాదన్నారు.

దేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోయిందా? అనే అంశంపై ‘సౌత్‌ఫస్ట్‌’ సంస్థ శనివారం హైదరాబాద్‌లో దక్షిణ్‌ డైలాగ్స్‌–2022 పేరుతో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ఏపీ, తమిళనాడు ఆర్థిక మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పళనివేల్‌ త్యాగరాజన్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ తదితరులు పాల్గొన్నారు.

చర్చలో పాల్గొన్న నేతలంతా కేంద్రం తీరును ఎండగట్టారు. గతంతో పోలిస్తే దేశంలో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోందని.. ఇటీవలి కాలంలో క్షీణత మరింత వేగం పుంజుకుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాలు మొదలుకొని స్థానిక సంస్థలు, ఇతర వ్యవస్థల విధులు బాధ్యతలు, పార్లమెంటులో ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. 

మాతో చర్చించకుండానే వేర్వేరు పేర్లతో విలీన ఉత్సవాలు.. 
హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఉత్సవాల విషయంలోనూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణతో కనీసం చర్చించకుండా వేర్వే రు పేర్లతో ఉత్సవాలు నిర్వహిస్తోందని విమర్శించారు. ‘74 ఏళ్ల కిందట నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను భారత దేశంలో కలిపేందుకు ఈ గడ్డపైకి వస్తే.. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను, వారి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించి లొంగదీసుకొనేందుకు, వారి సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దేందుకు వచ్చారు. కానీ ఇది ఎంతమాత్రం ఆమోదయో గ్యం కాదు. అందుకే నేను తరచూ చెబుతుంటా.. దేశానికి నిర్ణయాత్మక విధానాలు కావాలి తప్ప విభజన రాజకీయాలు కాదు’ అని వ్యాఖ్యానించారు. 

దక్షిణాదికి తక్కువ నిధులెందుకు? 
దేశ ప్రజలంతా అభివృద్ధి సాధించాలని తాము కోరుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం అవసరమైన రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు అభ్యంతరంకూడా లేదన్నారు. కానీ రాష్ట్రాల పన్నుల వాటాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తూ మానవాభివృద్ధి సూచీల్లో ఉన్నతస్థానంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇవ్వడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రా ల మధ్య పన్నుల వాటాలను ఎక్కడికక్కడ విభజించే ప్రత్యేక వ్యవస్థ ఎందుకు లేదన్నారు. ఈ అంశాలపై అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లేందుకూ ప్రయత్నిస్తామని చెప్పారు. 

రాజకీయంగానూ దెబ్బతినే ప్రమాదం: శశిథరూర్‌ 
కేంద్రం పోకడల వల్ల భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 2021 లెక్కల ప్రకారం 2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు రావొ చ్చని ఆయన హెచ్చరించారు.

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2026లో పార్లమెంటరీ స్థానాల పునర్విభజన జరిగినప్పుడు దక్షిణాది ప్రాతి నిధ్యం తగ్గే పరిస్థితి వస్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టు సమస్యను అధిగమించాల్సి ఉంటుందన్నారు. ప్రతి రాష్ట్రానికి తనదైన అవసరాలు ఉంటాయని.. వాటిని తీర్చుకొనేందుకు చేసే ప్రయత్నాలకు కేంద్రం మోకాలడ్డుతోందని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌ ఆరోపించారు. 

సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ఏకం కావాలి 
రాజ్యాంగం నిర్వచించిన, హామీ ఇచ్చిన సమాఖ్యవాదాన్ని కాపాడుకొనేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలని పలువురు వక్తలు సూచించారు. శనివారం హైదరాబాద్‌లో సౌత్‌ఫస్ట్‌ సంస్థ దక్షిణ్‌ డైలాగ్స్‌ పేరుతో సమాఖ్యవాదం–న్యాయవ్యవస్థ పాత్రపై ఏకాభిప్రాయం పెంపొందించడం’అనే అంశంపై మరో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్, నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి మోహన్‌ గోపాల్‌ పాల్గొన్నారు.

అమెరికాలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకుండా వాటిని కలపడం సాధ్యం కాదని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తెలిపారు. కానీ మన దేశంలో ఒక రాష్ట్ర ఏకాభిప్రాయం తీసుకోకుండానే పార్లమెంటు చేసిన చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఆ రాష్ట్రాన్ని విభజించే పరిస్థితి ఉందని పరోక్షంగా తెలంగాణ విభజనను ప్రస్తావించారు. ఒవైసీ మాట్లాడుతూ బీజేపీ మరిన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ఒవైసీ స్పందిస్తూ తాను రిజర్వేషన్‌ లేకుండా జీవించగలనని, కానీ అన్యాయంతో జీవించలేనన్నారు. రిజర్వేషన్లు అన్ని పార్టీలకు రాజకీయ సాధనంగా మారాయన్నారు.  

మరిన్ని వార్తలు