సవాల్‌ చేస్తున్నా.. లెక్కలు నిరూపించకుంటే అమిత్‌షా ముక్కునేలకు రాస్తారా?

5 Jun, 2022 19:21 IST|Sakshi
అమిస్తాపూర్‌లో జరిగిన సభకు హాజరైన మహిళలు ∙కోస్గిలో మార్కెట్‌ను ప్రారంభించి మహిళతో ముచ్చటిస్తున్న కేటీఆర్‌ 

కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది.. రూ.3,68,797 కోట్లు

వాపస్‌ వచ్చినవి.. రూ.1,68,000 కోట్లు 

ఇది తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్‌తో కులమతాలకతీతంగా ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం. ముసలోళ్లు, దివ్యాంగులు తదితర వర్గాలకు ఆసరాగా నిలుస్తున్నాం. ఇదంతా కేసీఆర్‌ సమర్థతకు నిదర్శనం’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.

ఎన్నికలు వచ్చే సంవత్సరం వస్తాయి కావొచ్చు.. ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌ సారథ్యంలోని అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీల్లో.. సుమారు రూ.160 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా అమిస్తాపూర్, కోస్గిల్లో జరిగిన బహిరంగ సభల్లో కేటీఆర్‌ మాట్లాడారు. ‘ఈ మధ్యనే అమిత్‌షా వచ్చారు. తెలంగాణకు రూ.2,52,000 కోట్లిచ్చినం.. మాతోని మంచిగుంటే ఇంకా ఇస్తుంటిమి అన్నరు. అయితే, పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది రూ.3,68,797 కోట్లు. రాజ్యాంగం ప్రకారం వాపస్‌ రావాల్సిన వాటిలో రూ.1,68,000 కోట్లే వచ్చినయ్‌.

అంటే కేంద్ర ప్రభుత్వానికి మన చెమటతో రూ.2 లక్షల కోట్లు ఇచ్చినం. కేంద్రం మనకు ఇచ్చింది ఏమీ లేదు. బీజేపీ నాయకులకు సవాల్‌ చేస్తున్నా.. నేను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. అమిత్‌షా చెప్పింది తప్పయితే తెలంగాణకు వచ్చి ముక్కు నేలకు రాసి తప్పు ఒప్పుకుంటారా?’అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 

మళ్లీ మీకు అవకాశమా..
‘జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిర, రాజీవ్‌.. ఇలా 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. రాహుల్‌ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశం ఇవ్వాలని అడిగారు. మీ పార్టీకి ఒకటి కాదు.. పది అవకాశాలిచ్చారు. చేసేంది ఏమీ లేదు. రేవంత్‌రెడ్డి ఓ ఐరన్‌ లెగ్‌. ఏ పార్టీలో కాలుపెడితే అది నాశనమే. టీడీపీలో కాలుపెట్టి చంద్రబాబును నాశనం చేసిండు.

కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు అందులోకి జొర్రిండు. మీరు కొడంగల్‌లో తంతే అడ్రస్‌ లేకుండా పోయి మల్కాజిగిరిలో పడ్డడు. ఈ సారి మల్కాజిగిరి నుంచి తరిమేందుకు అక్కడి జనం సిద్ధంగా ఉన్నరు. పెద్దోళ్లను తిడితే పెద్దవాళ్లం అవుతామని అనుకుంటడు. పైసలు వసూలు చేస్తడు. డేంజర్‌ మనిషి’అని కేటీఆర్‌ అన్నారు. కరెంట్, నీళ్లు ఇలా అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. 

సైంధవ పాత్ర పోషిస్తున్నారు..
‘అమిస్తాపూర్, సిద్ధాయపల్లి ఇళ్లు చూస్తుంటే పల్లెటూళ్లకూ అపార్ట్‌మెంట్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందనిపించింది. రాష్ట్ర సర్కార్‌ ఊళ్లలో ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డులు, ట్రాక్టర్లు, రైతుబంధు, రైతు బీమా ఇస్తుంటే.. బీజేపీ వాళ్లు ఇవన్నీ మావే అని మాట్లాడతరు. మసీదులు తవ్వుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతుండు.

అదా చేయాల్సిన పని. దమ్ముంటే, చేతనైతే దేవరకద్రలోని బీడు భూములను తవ్వుదాం, నీరు పారిద్దాం. పేదల ఇళ్ల నిర్మాణానికి పునాదులు తవ్వుదాం. మేం లక్ష ఇళ్లు కడితే.. మీరు 2 లక్షలు కట్టి ప్రజల మనసులు గెలుచుకోండి. పాలమూరు పచ్చగా కావాలే అని ముఖ్యమంత్రి పట్టుదలతో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కొందరు దుర్మార్గులు, ప్రతిపక్ష పార్టీలు సైందవ పాత్ర పోషిస్తున్నాయ్‌’అని మంత్రి విమర్శించారు. 

మరిన్ని వార్తలు