జమ్మికుంట సభలో హుజురాబాద్‌ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్‌!

31 Jan, 2023 18:02 IST|Sakshi

కరీంనగర్‌: జమ్మికుంటలో బీఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హుజురాబాద్‌లో ఈసారి బీఆర్‌ఎస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ విశ్వాసం కల్పించారని చెప్పి పరోక్షంగా ఆయనే అభ్యర్థి అని ప్రకటించారు. ఎన్నికలు వచ్చే వరకూ ప్రజల్లోనే ఉండాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు

బీఆర్‌ఎస్ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, అదే డీఎన్‌ఏ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో మళ్లీ పొరపాటు జరగొద్దన్నారు. అందరికీ భరోసా ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? మోసం చేసే పార్టీలు కావాలా?  రైతన్నలారా ఆలోచించండి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రానికి, దేశానికి ఏ పార్టీ అరిష్టమో ఆలోచించండి అన్నారు.

మోదీ ఎవరికి దేవుడు?
'మోదీ ఎవరికి దేవుడు? ఎవనికి దేవుడు? రూ.400 సిలిండర్‌ను రూ1,200 చేసిన మోదీ దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా యువతకు మోసం చేసిన మోదీ దేవుడా? పెట్రోల్ ధరలు పెంచారు. మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేయలేదా? దమ్ముంటే చెప్పు ఈటల రాజేందర్.  చేనేతపై ఏ ప్రధాని వేయని పన్ను మోదీ వేశారు. పద్మశాలీలు ఆలోచించాలి. బండి సంజయ్ దమ్ముంటే కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకు రావాలి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'14 నెలల కిందట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారు. ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాను తీసుకొస్తాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఒక్క రూపాయి వచ్చిందా? మాటలు కోటలు దాటాయి. చేతలు గడప కూడా దాటలేదు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల అన్నారు. బాధ అనిపించింది. అసలు ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌కు పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు కాదా?  33 మంది పోటీ పడితే ఈటలకు టికెట్ ఇవ్వలేదా?' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్‌ని కరీంనగర్ నుంచి ఎందుకు గెలిపించాని కేటీఆర్ ప్రశ్నించారు. మసీదులు తవ్వడం కాదు, దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా.. అని సవాల్ విసిరారు. మాట్లాడితే పాకిస్తాన్, హిందూస్తాన్ అంటారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌కు గుజరాతీల చెప్పులు మోసే సోకు ఉండొచ్చని ఎద్దేవా చేశారు. 14 నెలల్లో ఈటల, బండి హుజూరాబాద్‌కు చిల్లిగవ్వ కూడా తేలేదని కేటీఆర్‌ ఫైర్ అయ్యారు.
చదవండి: పట్టించుకోని కేసీఆర్‌ సర్కార్‌.. తీర్థం ఇచ్చేందుకు సిద్ధమైన కమలం పార్టీ

మరిన్ని వార్తలు