ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. మంత్రిని నిలదీసిన చేనేత కార్మికులు

31 Jan, 2023 14:39 IST|Sakshi

హన్మకొండ: ఈటల రాజేందర్ ఇలాక కమలాపూర్లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్‌ ముందు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. వీరిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి నిరసన తెలిపిన ఐదుగురు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు కమ్యూనిటీ కాంప్లెక్స్ వద్ద మంత్రి కేటీఆర్‌ను చేనేత కార్మికులు నిలదీశారు. తమ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందనగా పద్మశాలీల అభివృద్ధికి ఏం చేశారో మోదీని అడగాలని కేటీఆర్ బదులిచ్చారు. దీంతో  మోదీ మాకు తెల్వదు.. మీరే అభివృద్ధి చేయాలంటూ ఓ మహిళ సమాధానమిచ్చింది.

పిల్లలతో భోజనం..
నిరసనలు ఎదురైన తన పర్యటను యథావిధిగా కొనసాగించారు కేటీఆర్. కమలాపుర్ ఎంజేపీ స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి ముచ్చటించారు. అనంతరం డ్రోన్ల ఉపయోగాల గురించి వివరించారు.

'డ్రోన్‌తో రైతుల పంటపొలాలపై పురుగుల మందు స్ప్రే చేయొచ్చు. డ్రోన్ అంటే కెమెరా కాదు.. మనుషులను తీసుకుకేళ్ళే వాహనం  కూడా అవుతుంది. డ్రోన్‌తో అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. వీటితో గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధరించవచ్చు. ఎవరూ చొరబడకుండా చూడవచ్చు' అని కేటీఆర్ చెప్పారు.

అలాగే చదువుకుని మీరంతా ఎమవుతారు? ఉద్యోగం చేస్తారా? అని విద్యార్థులను కేటీఆర్ ప్రశ్నించారు.  చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయవచ్చు లేదా 10 మందికి మీరే ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. అవకాశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పిల్లలను హైదరాబాద్‌లోని టీ-హబ్ టాస్క్‌కు తీసుకురావాలని కలెక్టర్, ప్రిన్సిపాల్‌లను కేటీఆర్ అదేశించారు.
చదవండి: తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం

మరిన్ని వార్తలు