చర్యకు ప్రతిచర్య తప్పదు 

28 Aug, 2021 00:31 IST|Sakshi

ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపాటు 

సీఎం కాలి గోటికి సరిపోని వారు కూడా విమర్శలు చేస్తున్నారు 

సహనానికీ హద్దు ఉంటుంది.. దూషణలపై ఓపిక పట్టేది లేదు 

కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు ఫ్రాంచైజీలా తీసుకుని నడిపిస్తున్నారు 

బాబు ఆడించే ఆటలో రేవంత్‌ ఓ తోలుబొమ్మ

అధికార యావతోనే బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 

సాక్షి, హైదరాబాద్‌: ‘సీఎం కేసీఆర్‌.. కాలి గోటికి సరిపోని కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లు మాట్లాడితే.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తరహాలో మేము మాట్లాడాల్సి వస్తుంది, చర్యకు ప్రతిచర్య తప్పదు’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కు ఎవరూ దిక్కులేక పక్క పార్టీ నుంచి చంద్రబాబు తొత్తును దిగుమతి చేసుకుంది. పట్టపగలు డబ్బు సంచులతో దొరికిన వాడిని పార్టీ అధ్యక్షుడిగా చేసుకున్నారు.

కాంగ్రెస్‌ను చంద్రబాబు ఫ్రాంచైజీ తీసుకుని నడిపిస్తున్నారు. చంద్రబాబు ఆడించే ఆటలో రేవంత్‌ ఓ తోలు  బొమ్మ’అని దుయ్యబట్టారు. ‘టీపీసీసీ అధ్యక్షపదవితో దేశానికి ప్రధాని అయినట్లు రేవంత్‌ ఫీల్‌ అవుతున్నాడు. మేడ్చల్‌ నియోజకవర్గానికి వెళ్లి మంత్రి మల్లారెడ్డిని రేవంత్‌ నోటికి వచ్చినట్లు తిట్టాడు. ఆ ఆవేశంలో మల్లారెడ్డి ఒక మాట అన్నడు. రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉం డాలి. రాష్ట్రాన్ని తెచ్చిన సీఎంను పట్టుకుని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడితే ఎన్ని రోజులు భరించాలి. కాంగ్రెస్‌ భాగస్వామ్య ప్రభు త్వం ఉన్న మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే అరెస్టు చేశారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’అని కేటీఆర్‌ హెచ్చరించారు. 

ప్రజలు సుభిక్షంగా ఉంటే వీళ్లకు కడుపునొప్పి.. 
‘ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపునొప్పి వస్తోందా? అధికార యావతప్ప వేరే జబ్బు ఏముంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసమో ప్రజలకు చెప్పాలి. హైదరా బాద్‌ వరదల్లో నష్టపోయిన వారికి నయాపైసా ఇవ్వకున్నా ఆశీర్వదించమని అడుగుతారా?, రూ.6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల్లో భాగంగా ఇంకా ఏవైనా ఆస్తులు ఉన్నాయో గుర్తించేందుకు యాత్ర చేస్తున్నారా?. మౌలాలిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు 4 ఎకరాలు ఇవ్వలేదు.. కానీ ఇప్పుడు అక్కడే రైల్వేకు సంబంధించిన 21 ఎకరాలు అమ్మేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థల్లోని రూ.11.40 లక్షల ఉద్యోగాల్లో దళితులు, ఎస్టీలు, ఓబీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేంద్రంలో అమలు చేసేలా సంజయ్‌.. మోదీకి సలహా ఇవ్వాలి’అని మంత్రి వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్‌ 2 నుంచి సంస్థాగత కమిటీలు 
‘రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో సెప్టెంబర్‌ 2న జెండా పండుగ నిర్వహించి టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభించాలి. అదే రోజు ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. సెప్టెంబర్‌ 12లోగా గ్రామ, వార్డు కమిటీలు, అదే నెల 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలి. సెప్టెంబర్‌ 20 తర్వాత పార్టీ ముఖ్య నేతలతో చర్చించి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గాన్ని కేసీఆర్‌ ఏర్పాటు చేస్తారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 150 డివిజన్‌ కమిటీలతో పాటు 1,400కు పైగా నోటిఫైడ్‌ మురికివాడల్లోనూ బస్తీ కమిటీలు ఏర్పాటు చేస్తాం. పార్టీ నియమావళి ప్రకారం.. అన్ని కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 51 శాతం అవకాశం ఇవ్వడంతో పాటు మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పిం చాలి. మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో సోషల్‌ మీడియా కమిటీలు కూడా ఏర్పాటు చేసి, క్రియాశీలంగా పనిచేసే వారికే పార్టీ కమిటీల్లో చోటు కల్పిస్తాం. జీహెచ్‌ఎంసీలో కమిటీల ఏర్పాటు గురించి రెండుమూడు రోజుల్లో సమావేశం జరుగుతుంది. పార్టీ ఏర్పడిన 20 ఏళ్లలో ఢిల్లీలో జెండా పాతే స్థాయికి ఎదగడం హర్షణీయం’అని కేటీఆర్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు