మోదీ కొత్త స్కీం తెచ్చిండ్రు.. పైసలన్నీ ఒక్కరి ఖాతాలోకే..! కేటీఆర్‌ సెటైర్లు

8 Mar, 2023 18:30 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: తొర్రూరు మహిళా సభలో మాట్లాడుతూ  కేంద్రంపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం మొత్తం తీసుకు వస్తానన్న ప్రధాని మోదీ.. అధికారంలోకి వచ్చాక మొత్తం పైసలన్నీ ఒక్కరి ఖాతాలో వేసిండని ధ్వజమెత్తారు. మొదట వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్ అన్నారని, ఇప్పుడు కొత్త స్కీమ్ తెచ్చి వన్ నేషన్ వన్ ఫ్రెండ్- ఒక దేశం ఒక దోస్త్‌ అంటూ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నాడని విమర్శలు గుప్పించారు.

'శ్రీలంక పోయి రూ.6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించారు. గవర్నమెంట్ అగ్రిమెంట్ అని నమ్మబలికి దోస్త్‌కు దోచిపెట్టి, దొంగ సొమ్ముతో ఎమ్మెల్యేలు కొనాలి.. ప్రభుత్వాలను కూల్చాలని పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎనిమిదిన్నర ఏళ్ళలో ఏం చేసావయ్యా మోదీ.. అంటే చెప్పడానికి ఏమీ లేదు. ఆకాశంలో అప్పులు ఉన్నాయి. దేశంలో ఉన్నవాళ్లంతా పిచ్చోళ్ళు రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1,200 చేసినా కరుకాచి నాకు వాత పెడతలేరు అనుకుంటున్నాడు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేకపోయారు. కేవలం హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టి మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి అన్ని పిరం చేశారు.  అలాంటి ప్రధాన మంత్రి మనకు అవసరమా? అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల కంటే పాలకుర్తిలో బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రూ.1,550 కోట్లు మహిళా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ చిరు కానుకగా అందజేయడం జరుగుతుందన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా 20 పంచాయితీలను ఎంపికచేస్తే 19 తెలంగాణకు చెందినవే ఉన్నాయన్నారు. త్రీ స్టార్, ఫోర్ స్టార్‌లో మన పంచాయతీలే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు.  రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్‌లు అని పేర్కొన్నారు.

తొర్రూరుపై వరాల జల్లు..
తొర్రూరు మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కొడకండ్లలో రెండు ఎకరాల్లో మినీ టెక్ట్స్‌టైల్‌  పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తొర్రూర్ లో 50 పడకలు, పాలకుర్తిలో మరో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు తాము ఏం చేశామో ఘంటాపథంగా చెప్పగలుగుతాం, మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బేజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పగలుగుతుందా? అని ఛాలెంజ్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతులు ఉల్లిగడ్డ పండిస్తే కేవలం 2 రూపాయలే వచ్చాయట అని సైటర్లు వేశారు.
చదవండి: ఢిల్లీ వెళ్లేముందు కేసీఆర్‌తో మాట్లాడిన కవిత.. ఏం చెప్పారంటే..?

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు