గవర్నర్‌తో వివాదంపై స్పందించిన కేటీఆర్‌.. ఏమన్నారంటే!

7 Apr, 2022 17:24 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ గవర్నర్‌తో వివాదంపై మంత్రి కేటీఆర్‌ తొలిసారి స్పందించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్‌ తెలిపారు. గవర్నర్‌ అంటే తమకు గౌరవం ఉందని, ఆమెను ఎక్కడా అవమానించలేదని స్పష్టం చేశారు. గవర్నర్‌ తనకు తానే ఊహించుకోకూడదని సూచించారు. గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగిందో వెల్లడించాలని తెలిపారు. తనను ఇబ్బందిపెడుతున్నారని గవర్నర్‌ అంటున్నారని, అందంతా అవాస్తవమని కేటీఆర్‌ అన్నారు.

‘కౌశిక్ రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ ఆమోదం తెలపలేదని తెలిసింది .గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు కాదా. గవర్నర్ అయ్యేందుకు రాజకీయాలు  కావాలి కానీ ఎమ్మెల్సీకి ఎందుకు అడ్డు అవుతాయి. గతంలో నరసింహన్ గవర్నర్‌గా  ఉన్నప్పుడు మాకు ఏ పంచాయితీ లేదు. ఇప్పుడు ఎందుకు సమస్య వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్త: అమిత్‌ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్‌ తమిళిసై

కాగా తెలంగాణలో గత కొంత కాలంగా కేసీఆర్‌ వర్సెస్‌ గవర్నర్‌ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపగా.. గవర్నర్ ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదం రాజుకున్నట్లు, గవర్నర్‌, కేసీఆర్‌ మధ్య గ్యాప్‌ పెరిగిపోయిందని సమాచారం. ఆ తర్వాత కూడా ఏ కార్యక్రమంలోనూ ఇద్దరు కలిసి పాల్గొనకపోవడంతో కేసీఆర్‌ గవర్నర్‌ను దూరం పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లోనూ కేసీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ మంత్రులు ఎవరూ హాజరు కాలేదు.

దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్లైంది.ఈ విషయంపై గవర్నర్‌ కూడా పలు సందర్బాలలో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్‌కి కనీసం ప్రొటోకాల్ మర్యాదలు పాటించకుండా అవమానాలకు గురిచేశారని అన్నారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, రాజ్‌భన్‌ను గౌరవించాలన్నారు. ఇక ఇటీవల గవర్నర్‌ళిసై యాదాద్రి పర్యటనకు వెళ్తే కనీసం ఈవో స్థాయి అధికారి కూడా స్వాగతం పలకకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం.. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. 

మరిన్ని వార్తలు