మోదీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం

8 Nov, 2022 01:09 IST|Sakshi

నోట్లరద్దు విఫల నిర్ణయం.. ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

వేల కంపెనీలు మూతపడ్డాయి.. నిరుద్యోగం పెరిగింది

సంక్షేమ కార్యక్రమాల అమలుకు భారీగా దెబ్బ

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నగదు చలామణీ పెరిగిందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. పురోగమన దిశగా అడుగులు వేస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని విమ ర్శించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చి ఆరేళ్ల యిన సందర్భంగా కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవా దానికి నిధులు ఆపడం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ బీజేపీ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ తిరోగమనం
రద్దయిన పెద్దనోట్లలో 99.3 శాతం తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వుబ్యాంకు గణాంకాలతో సహా ప్రకటించిందని.. లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తున్నట్టు చెప్పిన కేంద్రం చివరికి తెల్ల ముఖం వేయాల్సి వచ్చిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. పైగా కొత్త నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐకి రూ.21 వేల కోట్లు అదనపు ఖర్చు అయిందన్నారు.

2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జనవరి నాటికి దేశంలో రూ.17.97 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉండేదని.. ప్రస్తుతం అది 72శాతం పెరిగి రికార్డు స్ధాయిలో రూ.30.88 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. కేంద్రం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ వంటివి ఆర్థికవ్యవస్ధ పతనానికి కారణాలుగా చూపిస్తోందని.. లాక్‌డౌన్‌ కన్నా ముందు 2020 నాటికే వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్న విషయాన్ని దాచి పెట్టారని విమర్శించారు.

ఉపాధిపోయి.. నిరుద్యోగం పెరిగి..
పెద్ద నోట్ల రద్దు, కరోనా అనంతర నిర్ణయాల వల్ల చిన్నాపెద్దా పరిశ్రమలు లక్షలకొద్దీ మూతపడ్డాయని కేటీఆర్‌ చెప్పారు.దీనితో నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. 2016 నుంచి 2019 మధ్య సుమారు 50లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, 2016లో 88లక్షల మంది కనీసం ఐటీ రిటర్నులు దాఖలు చేయలేకపోయారని చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తులు, ఆర్థికవ్యవస్థలో కొనుగోళ్లు తగ్గడంతో ప్రభుత్వాల పన్ను రాబడులు తగ్గిపోయాయని, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడిందని చెప్పారు.

మోదీ క్షమాపణలు చెప్పాలి
నోట్ల రద్దు నిర్ణయం తప్పు అయితే 50రోజుల తర్వాత తనను సజీవంగా దహనం చేయాలంటూ అప్పట్లో ప్రధాని మోదీ మభ్యపెట్టారని కేటీఆర్‌ విమర్శించారు. ఇప్పుడు నోట్ల రద్దు దుష్పరిణామాల బాధ్యతను తీసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు