రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి

26 Aug, 2021 11:00 IST|Sakshi
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ(గురువారం) సాయంత్రం వరకు రేవంత్‌రెడ్డికి గడువు ఇస్తున్నానని, తన సవాల్‌ని స్వీకరించాలని అన్నారు. తన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టంచేశారు. తాను సంపాదించిన ప్రతిరూపాయి తన కష్టార్జితమేనని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి.. కేటీఆర్, కేసీఆర్‌పైన వాడిన భాష చూసే తీవ్రస్థాయిలో  స్పందించానని తెలిపారు. 

చదవండి: Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి

బుధవారం తెలంగాణ భవన్‌లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘నువ్వు అబద్ధాలు, బ్లాక్‌మెయిల్‌ వ్యవహారాల్లో నంబర్‌ వన్‌ కదా. గురువారం నేను నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దమ్మూ ధైర్యం ఉంటే నువ్వు పీసీసీ చీఫ్, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తావా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ‘నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇప్పుడు, రేపు, రెండేళ్లు ఆగు అని సవాల్‌ చేసుడు కాదు.. దమ్ముంటే ఇప్పుడు పోటీ చేసి గెలిచి ట్రైలర్‌ చూపించు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి ఇంటికి పోవాలే’అని మల్లారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మరిన్ని వార్తలు