‘పంజాబ్‌లో మీ పార్టీని ఈడ్చి తన్నారు’

7 May, 2022 10:31 IST|Sakshi

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవాళ్లే బీజేపీలో చేరుతున్నారని తెలంగాణ మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌-బీజేపీలు కుమ్మక్కు అయ్యాయంటూ వరంగల్‌ ‘రైతు సంఘర్షణ సభ’లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగింది. అసలు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వాళ్లే బీజేపీలో చేరుతున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. 

తెలంగాణ భవన్‌ నుంచి మంత్రి నిరంజన్‌ రెడ్డి  మాట్లాడుతూ..‘రెండు పర్యాయాలు క్షమించకనే ఓడించారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేయాల్సింది మేము చేస్తున్నాం. మీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయా?. పంజాబ్ లో ఈడ్చి తన్నారు.  మీ కాంగ్రెస్ పార్టీని, మిమ్మల్ని పంజాబ్ ప్రజలు శిక్షించారు.

తెలంగాణలో పరిపాలన సవ్యంగా సాగుతోంది.రైతులకు సంక్షేమం సక్రమంగా జరుగుతుంది. మీరు ఇక్కడ రైతు డిక్లరేషన్ ఏం చేస్తారు.జాతీయ నాయకులు ఎవరో ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు చెప్పేవి అన్ని మోసాలే, అబద్దాలే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలియదు. ఏదో గంభీరంగా మాట్లాడితే ప్రజలు నమ్మరు. 60 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చీల్చి తెలంగాణ సాదించుకున్నాం.పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో స్వరాష్ట్రం సిద్దించింది. నిన్న మొన్న  కాంగ్రెస్‌ను తిట్టిన వాళ్లే ఇవాళ పార్టీ సారథులుగా ఉన్నారు’  అని ఆయన పేర్కొన్నారు. 

చదవండి👉టీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు 

మరిన్ని వార్తలు