బిడ్డా.. అన్నీ ఇంకా ఉన్నాయి! పొంగులేటికి పువ్వాడ ఘాటు కౌంటర్‌

22 May, 2023 13:30 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని.. చేసిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని మంత్రి అజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటికి, మంత్రి పువ్వాడ అజయ్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి పువ్వాడ ఆజయ్ పై తాను పోటీ చేసి గెలవడం కాదు... అతనిపై  బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు పువ్వాడ కౌంటర్‌ వ్యాఖ్యలు చేశారు. 

‘‘పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. పొంగులేటి చెప్పకపోయినా నేను చెబుతున్నా రాస్కోండి. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్‌ విలువ తెలుస్తుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా. పిట్టల దొర కూడా.  ఫ్రస్టేషన్‌లో ఉన్న పొంగులేటి.. పిట్టలదొరలాగా రోజూకో వేషం వేస్తున్నాడు. అలాంటి పిట్టల దొర మాటలకు భయపడే రకం కాదు నేను.  ఖమ్మం లో తనపై బచ్చాగాడినెవిడైనా నిలబెడుతానని పొంగులేటి అంటున్నాడు. ఎవరినైనా నిలబెట్టు.. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది’’ అని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు.  

‘‘నువ్వు సీఎం అవుతావని మురిసిపోతున్నావు. నువ్వు సీఎం ఏంటయ్యా?.. సీఎం కావాలంటే ఓ చరిత్ర కావాలి. వందల కోట్లు దోచుకున్నావు.  ఎన్నెస్పీ కెనాల్ పనులలో దోపిడీ చేసిన విషయం మర్చిపోయావా? బిడ్డా అన్నీ ఇంకా ఉన్నాయి. ఆ కేసులెక్కడికీ పోలేదు. రేపు రా బిడ్డా.. నీ చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు ఖమ్మం వస్తున్నారు.  డబ్బుందనే మదంతో విర్రవీగుతున్నావు. నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానం. 

ఖమ్మం రాజకీయ చరిత్ర లో పుట్టిన వాడే పువ్వాడ. ఆ పువ్వాడ కు పుట్టిన వాడే ఈ పువ్వాడ. నీ పక్కన ఉన్న అరాచక శక్తుల గురించి ముందు మాట్లాడు.  ఖమ్మంలో నాకు దమ్ము ఉంది. అరాచక శక్తులను అణచివేశా. రౌడీ షీటర్లను అణచివేశా. మట్టి దందా అంటున్నావు. నా మనుష్యులు ఎవరు దందా చేశారో నిరూపించే దమ్ము ఉందా?. నువ్వు ఎంపీగా ఖమ్మంకు చేసిన మేలు ఏంటో చెప్పగలవా?. పిచ్చోడా.. ఖమ్మం లో లైట్లు పెడితే అభివృద్దా? అంటున్నావు.   ఒక్క లైట్లు కాదు అన్ని రంగాలలో అభివృద్ది చేశా.   ఎవరో బచ్చాను నిలబెట్టి నాపై గెలిపిస్తా అంటున్నావు. రా.. ఎవడినైనా ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది. నీ చేతిలో మోసపోయిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు. మదన్ లాల్ ని నువ్వు ఓడించలేదా?. ప్రతీ ఎన్నికలో పార్టీ అభ్యర్థుల కు వెన్నుపోటు పొడవలేదా? అంటూ పువ్వాడ, పొంగులేటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పాతిపెడతాం

మరిన్ని వార్తలు