బండి సంజయ్‌కు ‘కంటి వెలుగు’ పరీక్షలు అవసరం

20 Jan, 2023 01:09 IST|Sakshi
మాట్లాడుతున్న పువ్వాడ. చిత్రంలో  పల్లా రాజేశ్వరరెడ్డి, రవిచంద్ర 

దేశంలోనే కాదు.. ఖమ్మం రాజకీయాల్లోనూ మార్పు

కాంగ్రెస్‌ ఓటమికి సుపారీలు కాదు.. వాళ్ల నేతలే చాలు: పువ్వాడ

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభ ద్వారా దేశ రాజకీయాలతోపాటు జిల్లా రాజకీయాలు కూడా మారుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. పార్టీ నేతల సమన్వయంతో సభ విజయవంతమైందని, ఖమ్మం చరిత్రలో ఈ తరహా సభ ఎన్నడూ జరగలేదని అన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి గురువారం బీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష కార్యాలయంలో అజయ్‌ మీడియాతో మాట్లాడారు.

ఖమ్మం సభ ఫ్లాప్‌ అయిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంతటి భారీసభను కూడా చూడలేకపోయిన ఆయనకు కంటి వెలుగు పరీక్షలు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 24 గంటల కరెంటు గురించి సంజయ్‌కు సందేహాలు ఉంటే, రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకుని చూడాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్‌ సుపారీ ఇచ్చారంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే సరిపోతారన్నారు.

సభలో ఖమ్మం జిల్లాకు సీఎం నిధుల వరద పారించారని, అభివృద్ధికి గుమ్మంలా ఖమ్మం మారిందని పువ్వాడ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా 2001లో జరిగిన కరీంనగర్‌ సభ తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసినట్లే, ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతుందని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రగతిశీల శక్తుల కలయికకు ఖమ్మం సభ బాటలు వేసిందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ రంగాన్ని బడా పారిశ్రామికవేత్త అదానికి కట్టబెట్టే కుట్రలను ప్రతిఘటించడంతోపాటు తెలంగాణ తరహాలో దేశమంతా ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదని బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ద్వారా తేలిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు కూడా రావని రవిచంద్ర అన్నారు.

మరిన్ని వార్తలు