ఉపన్యాసాలు మాని ఉద్ధరించేది చెప్పండి 

14 May, 2022 01:38 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి

తెలంగాణకు ఏమిస్తారో చెప్పండి 

అమిత్‌షాకు మంత్రి సబిత డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కేవలం చుట్టపు చూపుగా, పొలిటికల్‌ టూరిస్టుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా తెలంగాణకు ఏమిస్తారో వెల్లడించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ శనివారం నిర్వహించనున్న బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వస్తున్న నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

స్థానిక బీజేపీ నేతలు చెబుతున్న అసత్యాలను అమిత్‌షా వల్లె వేస్తే తెలంగాణ ప్రజలు సహించబోరని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు గతంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తిరిగి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాలను బాగుపరిచే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాత్రం నెల రోజులుగా తన పాదయాత్రలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సబిత ఆరోపించారు.

వంట నూనెలు, వంట గ్యాస్, నిత్యా వసర సరుకుల ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామ ని పగటి కలలు కంటోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అసత్యాలు ప్రచా రం చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. అబద్ధాలకు అమిత్‌షా బాద్‌షాగా మారారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ విమర్శించారు. 

మరిన్ని వార్తలు