‘మరో 20 ఏళ్లు టీఆర్‌ఎస్‌దే అధికారం’

27 Oct, 2021 03:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్లీనరీ విజయవంతం కావ డంతో ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ మరో 20 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని ప్లీనరీతో భరోసా కలిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు ఎవ్వరూ పట్టించుకోరని, టీఆర్‌ ఎస్‌ అణగారిన వర్గాల ప్రయోజనాలను కోరుకోవడంతో జాతీయ పార్టీలకు కడుపు మంటగా మారిం దని చెప్పారు.

ఏడేళ్ల పసికూన తెలంగాణ దేశం గర్వపడేలా అభివృద్ధి సాధిస్తోందన్నారు. కేసీఆర్‌ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు బాగుపడుతున్నాయన్నారు. ప్లీనరీలో ఏం చేయాలన్నది పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. దళితబంధును చూసి ఓర్వలేకే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేశామని, అందుకే హుజూరాబాద్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని జోస్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు