ఓటమి భరించలేక బీసీ నేతలపై కుట్రలు... 

11 Nov, 2022 00:58 IST|Sakshi

ఈడీ, ఐటీలను ఉసిగొలిపి దాడులు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌   

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఓటమి భరించలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆగహ్రం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, ఈడీ, ఐటీ పేరిట బీసీ నేతలపై దాడులకు దిగిందని దుయ్యబట్టారు. గురువారం లండన్‌ నుంచి ఆయన ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి చేతనైతే బ్యాంకుల్లో రుణాల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోడీ, లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా వంటి ఘరానా మోసగాళ్లను దేశానికి పట్టుకు రావాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రానైట్‌ వ్యాపారంలో ఉన్న మంత్రి గంగుల కుటుంబంపై కక్ష కట్టి ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల మంత్రి కాబట్టే ఆయన్ను టార్గెట్‌ చేశారని, గంగులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఈడీ, ఐటీలకు బెదరబోమని స్పష్టం చేశారు. అకమ్ర దాడులతో తెలంగాణ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమనేది ఈ ఘటనతో సహా ఇప్పటికే ఎన్నో మార్లు రుజువైందని మంత్రి పేర్కొన్నారు.     

మరిన్ని వార్తలు