ప్రతిపక్షాలకు మంత్రుల సవాల్‌.. నిరూపిస్తే రాజీనామాలు

23 Jun, 2021 03:16 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ దివిటీపల్లిలో ప్రతిజ్ఞ చేస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌ రెడ్డి

మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

సీఎం కేసీఆర్‌ మొండి.. మంచికి మంచి, చెడుకు చెడుగా ఉంటాడు

దివిటీపల్లి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో వ్యాఖ్యలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తెలంగాణను అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణానదిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తపోతల, ఆర్డీఎస్‌ కుడి కాల్వ ప్రాజెక్టులను విరమించుకోవాలని.. లేకుంటే ప్రజాయుద్ధం తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ మొండి అని.. మంచికి మంచి, చెడుకు చెడుగా ఉంటారని.. తెలంగాణకు నష్టం వాటిల్లేలా ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తూ ఊరుకోరన్నారు. త్వరలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర సీఎం రాయలసీమ ప్రాజెక్టు, ఆర్డీఎస్‌ కుడి కాల్వ కట్టి తీసుకుపోతున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతుంటే.. పాలమూరు జిల్లాకు చెందిన అప్పటి మంత్రి మంగళహారతులు పట్టారని విమర్శించారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎక్కడ ఉన్నా ఆంధ్రోళ్లేనని.. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక్కడ రైతులు బతకొద్దా...
ఎవరి బతుకులు వాళ్లు బతకాలని, రైతులు ఎక్కడ ఉన్నా రైతులేనని.. తెలంగాణలోని రైతులు కూడా బతకొద్దా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్‌ అక్రమ ప్రాజెక్ట్‌లపై మరో ప్రజాయుద్ధం చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్నింటా ముందంజలో ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్లు, పింఛన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. లాంటి పథకాలు మీరు పాలించే ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలంటూ వేముల ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. వారు మొరిగే కుక్కలని.. ఇవి తప్పని నిరూపిస్తే తనతో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సైతం రాజీనామా చేస్తారంటూ సవాల్‌ విసిరారు. తెలంగాణకు అన్యాయం జరిగే రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్‌ చూస్తూ ఊరుకోరన్నారు. కాగా, సభ చివరలో ఆంధ్ర నిర్మించే అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్‌నా..
చదవండి: ఈ సీఎం కేసీఆర్‌ మీ చేతిలో ఉన్నాడు

మరిన్ని వార్తలు