కేసీఆర్‌ టక్కుటమార విద్యలు పనిచేయవ్‌ 

8 Dec, 2021 02:20 IST|Sakshi

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల 

వనపర్తి: సాధారణ, ఉపఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రదర్శించే టక్కుటమార విద్యలను ఇకముందు ప్రజలు విశ్వసించచోరని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలో బీజేపీ జిల్లా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో 46 వేల ఓట్ల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతామని రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలో గొప్పలు చెప్పిన సీఎం.. ఏడేళ్లలో ఎన్ని దళిత కుటుంబాలకు న్యాయం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తే.. కేసీఆర్‌కు పూలవర్షం కురిపిస్తామని, లేదంటే ప్రగతిభవన్‌ ఎదుట చావు డబ్బు కొడతామని ఈటల హెచ్చరించారు. గొర్రెల పంపిణీలో బ్రోకర్లకు ప్రజాధనం కట్టబెట్టినట్లుగా గేదెల పంపిణీ చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం ఇన్నాళ్లు ధాన్యం కొనుగోలు చేస్తే.. కేసీఆర్‌ తానే రాష్ట్రప్రభుత్వం తరఫున రైతులపై ప్రేమతో ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటనలు చేశారని మండిపడ్డారు.   

మరిన్ని వార్తలు