బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

25 Nov, 2022 01:54 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దౌర్భాగ్య పరిపాలన: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల కష్టాలను గాలికి వదిలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దౌర్భాగ్య పరి పాలన అందిస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లా డుతూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం దేశానికి తెస్తానన్న హామీలు పత్తా లేకుండా పోయాయని విమర్శించారు.

పెరిగిన ధరలకు సమాధానం లేదని, ఎన్నికలప్పుడు మతాన్ని రెచ్చ గొట్టి లబ్ధిపొందడం ఒక్కటే బీజేపీకి తెలుసని నిందించారు. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల హామీ నెరవేరలేదని, 57 ఏళ్లకు పెన్షన్‌ ఇస్తానన్న వాగ్దానాలు అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రజలు కూడా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ మోసపూరిత మాటలను పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ అవగాహనతోనే రాష్ట్రంలో చెత్త రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. అమిత్‌షా, కేసీఆర్‌లు ప్లాన్‌ ప్రకారమే రెండు పార్టీల పంచాయితీ పెట్టుకొంటూ కాంగ్రెస్‌ను రాష్ట్రంలో లేకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. 

ఈడీ, ఐటీలకు బండి చీఫ్‌లా మాట్లాడుతున్నారు 
ఈడీ, ఐటీ అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్‌ మాట్లాడుతున్నారని, ఈ రెండు విభాగాలకు బండి సంజయ్‌ చీఫ్‌ అయ్యారా అనేది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచే డబ్బులు సంపాదించారని, 8 ఏళ్లుగా లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఈడీ, ఐటీలను వాడుతుంటే కేసీఆర్‌ ఏసీబీని వాడుకుంటున్నారని , రెండు పార్టీలదీ రాజకీయమేనని అన్నారు.

డబ్బులు ఇస్తే కాంగ్రెస్‌ లో పదవులు రావని, రాహుల్‌ గాంధీ పై మర్రి శశిధర్‌ రెడ్డి మాట్లాడటం తప్పని జగ్గారెడ్డి ఖండించారు. మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యారని, ఆయన కూడా డబ్బులు ఇచ్చి సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. తాను రాహుల్‌ గాంధీ, ఠాగూర్‌లకే జవాబుదారీ అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మంచి ఆర్గనైజర్‌ అని కొనియాడారు.   

మరిన్ని వార్తలు