బతుకుకు ధీమా లేదు.. చస్తే బీమా ఇస్తారా? 

25 May, 2022 01:12 IST|Sakshi

సొంత రాష్ట్ర రైతాంగంపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ 

ఎనిమిదేళ్లలో సీఎం రాష్ట్రంలో ఒక్క రైతు వద్దకైనా వెళ్లారా? 

సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లో అమలవుతున్న పథకాలు ఒంటె పెదవులకు నక్కలు ఆశపడ్డట్టుగా ఉన్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలోని రైతాంగం బతకడానికి ధీమా లేదు కానీ చనిపోతే మాత్రం బీమా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పాజి అనంత కిషన్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

రైతును బతికించేందుకు ప్రభుత్వాలు పనిచేయాలి కానీ చనిపోతే బీమా డబ్బులు ఇప్పించడమే గొప్పనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పెట్టుబడులు నష్టపోతే రైతాంగా నికి పంటల బీమా అమలు చేయాలని, రాష్ట్రంలో ఆ పథకమే అమల్లో లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇంతవరకు రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ‘రైతుబంధు’డబ్బులను బ్యాంకర్లు ఆ రుణాల కింద జమ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత రాష్ట్ర రైతాంగంపై కేసీఆర్‌ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని, రాజకీయాల కోసం  పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని విమర్శించారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు వద్దకు వెళ్లని కేసీఆర్‌.. పంజాబ్, హరియాణా రైతాంగాన్ని ఆదుకునేందుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలకు మతి ఉందో లేదో అర్థం కావడం లేదని, దివంగత వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే సంతకం చేసిన రైతులకు ఉచిత విద్యుత్‌ పథకాన్నే టీఆర్‌ఎస్‌ కొనసాగిస్తోందని గుర్తుంచుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు