Komatireddy Rajagopal Reddy: మునుగోడు కోసమే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా: రాజగోపాల్‌రెడ్డి ప్రకటన

2 Aug, 2022 19:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్‌ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన.  మునుగోడు ఎమ్మెల్యే హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చివరిసారిగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. 
 
మునుగోడు నియోజకవర్గం గురించి.. గత పది పన్నెండు రోజులుగా మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాపై చర్చ జరుగుతోంది. దీంతో నా రాజీనామాపై చర్చ పక్కదారి పట్టింది. నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా రాజీనామాపై నాన్చే ఉద్దేశం నాకు లేదు. 

మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వట్లేదు.  పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. పోడు భూములకు పాస్‌ బుక్‌లు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారాయన. 

ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తోంది.. చేస్తోందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే తాను గెలిపిస్తానని టీఆర్‌ఎస్‌కు చెప్పానని, అయినా ఎటువంటి పురోగతి లేదని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు ఓ కారణమని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, కానీ, నియోజకవర్గానికి ఏం చేయలేకపోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని చెప్పారాయన. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి, కనీస వసతులైనా కలగవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ నిజాయితీతో కూడిన రాజకీయాలకు కేరాఫ్‌ అని.. పదవులు, కాంట్రాక్టులు కావాలనుకుంటే టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఆఫర్‌ను తీసుకుని బాగుపడేవాళ్లమని ఆయన అన్నారు.

Poll
Loading...
మరిన్ని వార్తలు