ఎమ్మెల్సీ ఫలితాలు: ఏం జరుగుతుందో?

17 Mar, 2021 12:10 IST|Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలపై రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ

సిట్టింగ్‌తోపాటు బోనస్‌పై టీఆర్‌ఎస్, బీజేపీల్లో ఆశలు

ఈసారైనా గెలుస్తామన్నఅంచనాల్లో కాంగ్రెస్‌

తేలనున్న తెలంగాణ ఉద్యమకారులు, పలువురు స్వతంత్రుల భవితవ్యం  

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ ఎన్నికలను తలపిస్తూ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈసారి పట్టభద్రుల తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుందన్న అంచనాలు ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ప్రధాన రాజకీయ పక్షాల్లో నెలకొంది.

కాంగ్రెస్‌కు చావోరేవో...
మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్ట భద్రుల స్థానంతోపాటు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం హైదరాబాద్‌ స్థానం నుంచి బీజేపీ, నల్లగొండ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ స్థానాలు నిలబెట్టుకోవడంతోపాటు మరో స్థానంలో పాగా వేయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పట్టభద్రుల ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే ఈసారి అనుకూల ఫలితాలు వస్తే గతంలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో కలిగిన అభిప్రాయం మారుతుందని, పట్టభద్రుల మెప్పు పొందగలిగితే మళ్లీ అనుకూల పవనాలు వీస్తాయని టీఆర్‌ఎస్ భావిస్తోంది. 

ఇక బీజేపీ మాత్రం టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితం వస్తే తమకు ఎదురు ఉండదని, 2023 ఎన్నికలకు ధీమాగా వెళ్లవచ్చని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. గతంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ తాజా రాజకీయ పరిస్థితులు తమకు లాభిస్తాయని, కేంద్ర, రాష్ట్రాలపై వ్యతిరేకతతో పట్టభద్రులు తమవైపే మొగ్గు చూపారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచినా 2023 ఎన్నికల వరకు ఆందోళన అవసరం ఉండదని భావిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ ఓడితే పార్టీ పరిస్థితి ఖల్లాసేననే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

ప్రొఫెసర్లు... ఉద్యమకారులు
ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు ఎం. కోదండరాం, డాక్టర్‌. కె. నాగేశ్వర్‌ల రాజకీయ భవితవ్యాన్ని కూడా పట్టభద్రులు నిర్దేశించనున్నారు. ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితం సాధించగలిగితే వారు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో కోదండరాం నల్లగొండ స్థానం నుంచి ప్రధాన పక్షాలకు గట్టిపోటీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. అలాగే రంగారెడ్డి నుంచి నాగేశ్వర్‌ ఏ మేరకు పట్టభద్రులను ఆకర్షించగలిగారన్నది ఈ ఫలితాలు తేల్చనున్నాయి. తెలంగాణ ఉద్యమంతో దృఢ అనుబంధం ఉన్న డాక్టర్‌ చెరుకు సుధాకర్‌తోపాటు మరికొందరు ఈ ఫలితాలతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఓ అంచనాకు రానున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు