మోదీ కాదు.. అదానే ప్రధాని: కవిత

1 Jun, 2022 00:43 IST|Sakshi
కాజీపేట సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత 

దేశంలో పరిశ్రమలు అదానీలకు ధారాదత్తం 

కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు కోసం కాజీపేట నుంచి ధర్మయుద్ధానికి పిలుపు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: నరేంద్ర మోదీ దేశ పరిశ్రమలు, సంస్థలను అదానీలకు కట్టబెడుతున్నారని, ప్రధాని మోదీ కాదు, అదానీ అన్న చందంగా దేశ పరిస్థితి తయారైందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మోదీ దేశంలో ఉంటే ఎలక్షన్‌ మోడ్, విదేశాల్లో ఉంటే ఎరోప్లేన్‌ మోడ్‌ తప్ప మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు.

ప్రధాని ఇలా ఉంటే దేశం ఏమవుతుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట సెంట్‌ గ్యాబ్రియల్‌ మైదానంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ అధ్యక్షతన కార్మిక ధర్మయుద్ధం భారీ బహిరంగ సభను మంగళవారం రాత్రి నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పాల్గొన్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ... దేశంలో 44 కార్మిక చట్టాలు రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం, నాలుగు నల్లచట్టాలను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు.

కార్మికుల హక్కులను కాలరాసే నల్లచట్టాలను రద్దు కోసం కాజీపేట నుంచే ధర్మయుద్ధం మొదలుపెడదామని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రజల్ని కళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలని, కార్మికుల చెమట చుక్కల విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని స్పష్టం చేశారు. మోదీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా మారిందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలుంటేనే దేశ ప్రజలకు మేలు జరుగుతుందని కవిత తెలిపారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ, కార్మికులపై కేంద్ర వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ చేపట్టిన ‘కార్మిక ధర్మయుద్ధం’ను స్పూర్తిగా తీసుకుని తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. బహిరంగ సభలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, మేయర్‌ గుండు సుధారాణి, వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లుతోపాటు పలువురు నేతలు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.  

యువతను మోసగిస్తున్న మోదీ
సాక్షి, హైదరాబాద్‌: ‘భారతీయ యువతను ప్రధాని నరేంద్ర మోదీ మోసగిస్తున్నారు. నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక వెల్లడిస్తోంది’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. 2020కి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఇరాన్‌లో అత్యధికంగా 28.5 శాతం నిరుద్యోగ యువత ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇరాక్, శ్రీలంక, భారత్‌ ఉన్నాయి. భారత్‌లో 24.9 శాతం నిరుద్యోగ యువత ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడిస్తోంది. మోదీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఎలా వంచిస్తుందో చూడండి అంటూ కవిత ట్వీట్‌ చేశారు.   

మరిన్ని వార్తలు