అవి అహంకారపూరిత వ్యాఖ్యలు

16 Jul, 2022 01:50 IST|Sakshi
మాట్లాడుతున్న ఉత్తమ్, చిత్రంలో మధుయాష్కీ, గీతారెడ్డి 

మంత్రి కేటీఆర్‌పై ఎంపీ ఉత్తమ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ చేసిన సర్వేలో తెలంగాణలో తమ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని, మంత్రి కేటీఆర్‌కి కళ్లు నెత్తికెక్కి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షు­డు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా­డుతూ కేటీఆర్‌ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు.

శ్రీలంకలో కుటుంబ పాలన వల్ల రాజపక్సేకు పట్టిన గతే కేసీఆర్‌ కుటుంబానికి పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో గెలవబోతోందని, 2024లో కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఉత్తమ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. గోదావరి వరదల వల్ల ప్రాణాలు కోల్పో­యిన వారికి కాంగ్రెస్‌ తరపున ప్రగాఢ సాను­భూతి తెలుపుతున్నామన్నారు.

2014లో కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత విద్యావ్యవస్థను సర్వనాశ­నం చేశారని విమర్శించారు. 12 లక్షల మంది విద్యార్థులకు రూ.3,270 కోట్ల బకాయిలు చెల్లించడం లేదన్నారు. 2014 తర్వాత 850 జూనియర్, 350 డిగ్రీ, 150 పీజీ, వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయని, ఫీజు కట్టలేక 30 శాతం విద్యార్థులు డ్రాప్‌ ఔట్‌ అయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు.

‘ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. మన ఊరు–మన బడి కోసం 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేశా­రు. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. 30 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి’అని ఉత్తమ్‌ విమర్శించారు. సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు