‘మండలి’ డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌!

10 Feb, 2023 02:43 IST|Sakshi

ఏడాదిన్నర తర్వాత శానన మండలికి డిప్యూటీ చైర్మన్‌

నేడు నోటిఫికేషన్, 11న నామినేషన్, 12న ఎన్నిక

అదే రోజు కొత్త డిప్యూటీ చైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

త్వరలో మండలి చీఫ్‌ విప్, విప్‌ల నియామకం?

సాక్షి, హైదరాబాద్‌: సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనుండగా, 11వ తేదీన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తదితరాలు పూర్తి చేస్తారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి బాధ్యతలు అప్పగిస్తారు.

కాగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆయన పేరును బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీంతో ఈ నెల 11న శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు బండా ప్రకాశ్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్‌ 2021 జూన్‌ 3న ఎమ్మెల్సీగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరగకపోవడంతో సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ఇదిలా ఉంటే 2018 మార్చిలో బీఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభకు ఎన్నికైన బండా ప్రకాశ్‌ ఎంపీగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేయకుండానే 2021 నవంబర్‌లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు.

అనంతరం 2021 డిసెంబర్‌ మొదటి వారంలో బండా ప్రకాశ్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్, మరో రెండు విప్‌ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌ ఒక్కరే ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ముగిశాక మండలి చీఫ్‌ విప్, విప్‌ పదవుల భర్తీ జరుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

మరిన్ని వార్తలు