మోదీ.. తెలంగాణ ద్రోహి

9 Feb, 2022 05:14 IST|Sakshi

పార్లమెంటు సాక్షిగా తెలంగాణ జాతిని అవమానించారు: భట్టి

మోదీ, కేసీఆర్‌లవి వీధినాటకాలని ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌ విభజన గురించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాజ్యసభ సాక్షిగా అమరవీరుల ఆత్మబలిదానాలను కించపరుస్తూ తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారని మండిపడ్డారు. మోదీ తెలంగాణ ద్రోహి అని అన్నారు. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ ఒక్క హామీనీ నెరవేర్చకుండా.. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు.

ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఇస్తే ఏపీలో అధికారం దక్కదని తెలిసినా అప్పటి యూపీఏ, ఎన్డీయే పక్షాలను ఒప్పించి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టిన రోజు లేని మోదీ ఇప్పుడు అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు.  అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే మంత్రి హరీశ్‌రావు రాష్ట్రానికి పట్టిన పెద్ద కర్మ అని, ఆయన కాంగ్రెస్‌ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ప్రారంభానికి గజ్వేల్‌కు ప్రధానిని ఆహ్వానించిననాడే విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించమని కేసీఆర్‌ కోరకుండా కొంచెం ప్రేమ ఇవ్వాలని కోరిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. మోదీ, కేసీఆర్‌లవి వీధి నాటకాలని విక్రమార్క విమర్శించారు. 

మరిన్ని వార్తలు