పవర్‌ఫుల్‌ పీడీ యాక్ట్‌.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏడాది జైల్లోనే! 

26 Aug, 2022 09:03 IST|Sakshi

నేరాల నియంత్రణలో కీలకాస్త్రం పీడీ చట్టం

పదే పదే నేరాలు చేస్తున్న వారిపై ప్రయోగిస్తున్న పోలీసులు

విచారణ లేకుండా ఏడాది జైల్లోనే ఉంచే అవకాశం

ప్రభుత్వం ఆమోదించిన తర్వాత బోర్డు లేదా హైకోర్టు రద్దు చేస్తేనే బయటకు..

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఓ ఎమ్మెల్యేపై విధింపు 

ఓ నేరం చేసి అరెస్టు కావడం..బెయిల్‌ పొంది బయటకు రావడం.. మళ్ళీ అదే ‘దందా’ కొనసాగించడం.. నగర కమిషనరేట్‌ పరిధికి చెందిన అనేకమంది రౌడీషీటర్లు, చైన్‌ స్నాచర్లు, సాధారణ దొంగల పంథా ఇది. ఇలాంటి వారికి చెక్‌ చెప్పడానికి పోలీసు విభాగం పీడీ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (ముందస్తు నిర్బంధం) చట్టాన్ని వినియోగిస్తోంది. గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు ప్రస్తుతం ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. ఓ ఎమ్మెల్యేని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకుని జైలుకు పంపడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం 

అప్పట్లో ఎక్సైజ్‌ విభాగమే...
నాటుసారా తయారీ–విక్రయం, మాదక ద్రవ్యాల అక్రమరవాణా–అమ్మకం, బందిపోటు దొంగతనాలు, మనుషుల అక్రమ రవాణా, భూ కబ్జాలు, గూండాయిజం.. ఈ తరహా నేరాలతో రెచ్చిపోతున్న వారిని నియంత్రించే ఉద్దేశంతో 1986లో పీడీ యాక్ట్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. ఓసారి ఈ చట్టం కింద అదుపులోకి తీసుకుంటే, ప్రభుత్వం ఆమోదిస్తే 12 నెలల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైల్లోనే ఉంచవచ్చు. ఆరు కేటగిరీలకు చెందిన వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించే అవకాశం ఉన్నా.. ఒకప్పుడు కేవలం నాటుసారా కేసుల్లో ఎక్సైజ్‌ విభాగం మాత్రమే దీన్ని వినియోగించేది. చాలా అరుదుగా మాత్రమే పోలీసు విభాగం ప్రయోగించేది. 

రాష్ట్రం ఏర్పడటంతో మారిన విధానం
పీడీ యాక్ట్‌ను మెజిస్టీరియల్‌ అధికారాలున్న జిల్లా కలెక్టర్‌ లేదా పోలీసు కమిషనర్‌ మాత్రమే వినియోగించగలరు. నగరంలో పదేపదే నేరాలకు పాల్పడుతున్న, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని 2014లో నగర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం స్పెషల్‌ బ్రాంచ్‌లో సంయుక్త పోలీసు కమిషనర్‌ నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ, న్యాయ సలహాదారుతో సహా 12 మంది సిబ్బందిని ఈ సెల్‌కు కేటాయించారు. పీడీ యాక్ట్‌ ప్రయోగ ప్రతిపాదనల్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి, దాని పరిధిలోకి వచ్చే వారిపై యాక్ట్‌ ప్రయోగానికి కొత్వాల్‌కు సిఫారసు చేయడం వీరి విధి. రాజాసింగ్‌ వ్యవహారంలోనూ ఈ విభాగం సిఫారసు ఆధారంగానే పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. 

నిర్ణీత కాలంలో మూడు నేరాలు చేస్తే.. 
నిర్ణీత కాలంలో మూడు నేరాలు చేసి కేసులు నమోదైన వారిపై ఈ యాక్ట్‌ ప్రయోగించే అవకాశం ఉంది. ఏదైనా పోలీసుస్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ ఈ తరహా నిందితులను గుర్తించి పీడీ యాక్ట్‌ ప్రయోగానికి ప్రతిపాదిస్తారు. దీన్ని ఏసీపీ సమీక్షించిన తర్వాత డీసీపీ ద్వారా కొత్వాల్‌కు చేరుతుంది. ఆయన పూర్వాపరాలు పరిశీలించాల్సిందిగా పీడీ సెల్‌ను ఆదేశిస్తారు. ఆ సెల్‌ ఒకే అని నివేదిక ఇస్తే, ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ అతను అప్పటికే జైల్లో ఉంటే అక్కడే ఇస్తారు.   

ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి
పీడీ యాక్ట్‌ ప్రయోగించడాన్ని ప్రభుత్వం సమర్ధించాల్సి ఉంటుంది. ఈ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకున్న వ్యక్తి పూర్తి వివరా లను ప్రభుత్వానికి పంపడం ద్వారా 12 రోజుల్లోగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆపై కేసు రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డుకు వెళ్తుంది. ఈ బోర్డు సదరు వ్యక్తి/ కుటుంబీకుల వాదనను విని, నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని పోలీసుల నిర్ణయాన్ని సమర్ధించడమో, లోపాలుంటే తిరస్కరించడమో చేస్తుంది. ఆ తర్వాత అప్పీల్‌ హైకోర్టులోనే ఉంటుంది. నగర కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 5 జోన్లు (ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్, సౌత్‌), 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. 2014 నుంచి పీడీ యాక్ట్‌ ప్రయోగాల్లో అత్యధికం పశ్చిమ మండల పరిధిలోనే జరిగాయి. రాజాసింగ్‌ కూడా ఈ మండల పరిధిలోని నివాసే కావడం గమనార్హం.  

కాగా,  ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ (పీడీ యాక్ట్‌)కు తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ చట్టానికి సవరణలు చేసింది. అదనంగా.. కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఆహార పదార్థాల కల్తీ, గేమింగ్‌, లైంగిక నేరాలు, పేలుళ్లు, ఆయుధాలు, వైట్‌కాలర్‌ ఆర్థికనేరాలు, అటవీ నేరాలు, నకిలీ పత్రాల తయారీ తదితరాలను దీని పరిధిలోకి తెచ్చింది. 2018లో మొత్తం 385 మందిపై, 2020లో 350 మందిపై ఈ చట్టం కింద కేసులు పెట్టారు. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైలులో నిర్బంధించవచ్చు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ పోలీసుల సంచలన ప్రకటన.. రాజా సింగ్‌పై పీడీ యాక్ట్‌

మరిన్ని వార్తలు