‘చలో మల్లారం’ భగ్నం

27 Jul, 2020 04:28 IST|Sakshi

ఉత్తమ్, భట్టి, ఇతర కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌

ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క గృహనిర్బంధం

కాంగ్రెస్‌ పార్టీ దళితుల వెంట ఉంటుంది

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇస్తున్నా: ఉత్తమ్‌

దళిత, గిరిజనులంటే ప్రభుత్వానికి లెక్కలేదు: భట్టి

కాటారం/లింగాలఘణపురం/రఘునాథపల్లి: కాంగ్రెస్‌ పార్టీ దళిత విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ‘చలో మల్లారం’కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం మల్లారంలో ఈ నెల 6న టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వార్డు సభ్యుడు దేవసాని శ్రీనివాస్‌ మరో ఇద్దరితో కలసి రేవెళ్లి రాజబాబు అనే దళిత యువకుడిపై దాడి చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పార్టీ నేతలు ఆరోపించారు. దాడి వెనుక టీఆర్‌ఎస్‌ కీలక నాయకుడి ప్రోత్సాహం ఉందని, అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌తో పీసీసీ ఎస్సీ సెల్‌ ‘చలో మల్లారం’కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

అదేవిధంగా కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నదని, ఈ ఘటనపై నిజనిర్ధారణజరగాలని టీఆర్‌ఎస్‌ పార్టీ సైతం ‘చలో మల్లారం’కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌–19 ప్రభావం, శాంతి భద్రతల పరి రక్షణ నేపథ్యంలో పోలీసులు ‘చలోమ ల్లారం’కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. ముందురోజు నుంచే మండలంలో 144 సెక్షన్‌ విధించి ఇరు పార్టీల నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేసి సమీప పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. కొయ్యూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఉత్తమ్, భట్టి అరెస్ట్‌..
‘చలో మల్లారం’కార్యక్రమానికి వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని జనగామ జిల్లా జనగామ–నెల్లుట్ల బైపాస్‌ రోడ్డు వద్ద అరెస్టు చేసి లింగాల ఘణపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పెద్దపల్లి జిల్లా మంథనిలో, ములుగు ఎమ్మెల్యే సీతక్కను హన్మకొండలో, వరంగల్‌ అర్బన్, రూరల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తదితర నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 

ఇది ఫ్యూడల్‌ పాలన: భట్టి 
‘దళిత, గిరిజనులంటే ప్రభుత్వానికి లెక్కలేదు. కనీసం వారికి రక్షణ కల్పించక పోవడమే కాకుండా బాధిత కుటుంబాల పరామర్శకూ అడ్డంకులు సృష్టించడం దుర్మార్గం. సీఎం కేసీఆర్‌ ఫ్యూడల్‌పాలన సాగిస్తున్నారు. ఈ అరాచక, నియంత పాలనకు చరమగీతం పాడక తప్పదు. మల్లారంలో జరిగిన హత్యపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇకపై ఇలాంటి ఘట నలు పునరావృతమైతే సహించబోం’అని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని శ్రీధర్‌బాబు అన్నారు.  దళిత హత్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 

టీఆర్‌ఎస్‌ హయాంలో ఆగని అకృత్యాలు: ఉత్తమ్‌
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళిత, గిరిజన వ్యతిరేక పాలన సాగిస్తున్నదని, అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి వారిపై దాడులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజబాబు కుటుంబాన్ని పరామర్శించేం దుకు వెళ్తుండగా అక్రమంగా తనను అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో ఏ దళిత, గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగినా కాంగ్రెస్‌ పార్టీ మీ వెంట ఉండి పోరాటం చేస్తుందని, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా, మీ ఉత్తమన్నగా మాట ఇస్తున్నానన్నారు. 

మరిన్ని వార్తలు