‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం 

29 Sep, 2020 05:22 IST|Sakshi
సోమవారం దిల్‌కుషా అతిథి గృహం వద్ద కాంగ్రెస్‌ నేతలు  రేవంత్, భట్టి, మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్‌ తదితరులను అరెస్టు చేసి బస్సులో తరలిస్తున్న పోలీసులు

దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌ వద్దే కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు 

రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యంతో సహా పలువురు నేతల అరెస్ట్‌ 

గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధాకరం: మాణిక్యం 

సీఎంతో భేటీకి కరోనా అడ్డురావడం లేదా?: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

అక్టోబర్‌ 2న రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం భగ్నమైంది. ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలన్నది కాంగ్రెస్‌ నేతల ఆలోచన కాగా, దిల్‌కుషా అతిథిగృహం వద్దే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి, గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించినా.. అక్కడ పోలీసులు మోహరించడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ బస చేసిన దిల్‌కుషా అతిథిగృహం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే, గవర్నర్‌.. కాంగ్రెస్‌ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుని గోషామహల్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, నాయకులు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, దామోదర రాజనర్సింహ, సంపత్‌ కుమార్, బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, నేరేళ్ల శారద, ఇందిరా శోభన్‌ తదితరులున్నారు.  

టీఆర్‌ఎస్‌కు నిబద్ధత లేదు: ఉత్తమ్‌ 
అంతకుముందు దిల్‌కుషా అతిథిగృహం వద్ద ఆందోళనకారులను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను నిలువరించే పోరాటంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ ఎస్‌ నిబద్ధతతో పనిచేయడం లేదని విమర్శించారు. ఈ బిల్లులను పార్లమెంట్‌లో ఏకపక్షంగా ఆమోదించుకోవడం ద్వారా ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని వ్యా ఖ్యానించారు. కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చే విధంగానే ఈ బిల్లులున్నాయని, వీటిని ఆమోదించడం వెనుక అనేక కుట్రలున్నాయన్నారు. అందుకే ప్రధాని మోదీ పార్లమెంటు బయట మాట్లాడిన అంశాలు ఈ బిల్లుల్లో లేవని ఉత్తమ్‌ ఆరోపించారు.

కేంద్రం చేసే ప్రతి ఆలోచనకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని, బీజేపీ–టీఆర్‌ఎస్‌లు ములాఖత్‌ అయి ఇప్పటివరకు అన్ని బిల్లులను ఆమోదించుకున్నారని చెప్పారు. ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ చెప్పినా వారిలో నిబద్ధత కనిపించడం లేదన్నారు. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, దేశ చరిత్రలోనే రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. అక్టోబర్‌ 2న రైతు సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చెప్పారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు రైతుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ తన కొనసాగిస్తుందని ఉత్తమ్‌ చెప్పారు.  

కరోనా వారికి అడ్డం కాదా? 
రైతుల పక్షాన వినతిపత్రం ఇచ్చేందుకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వకపోవడం దారుణమని ఉత్తమ్‌ అన్నా రు. కరోనా కారణంగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని గవర్నర్‌ కార్యాలయం తెలిపిందని, మరి సీఎంతో భేటీ అయినప్పుడు గవర్నర్‌కు కరోనా అడ్డం రాలేదా అని ప్రశ్నించారు. ఇదే విషయమై పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ గాంధీభవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము వినతిపత్రం ఇచ్చేందుకు వస్తామని మూడు రోజుల క్రితమే గవర్నర్‌కు సమాచారం ఇచ్చామని, కానీ కోవిడ్‌ నిబంధనల పేరిట అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో జరిగిందని, అన్ని చోట్లా గవర్నర్లు అనుమతించినప్పుడు తెలంగాణలో ఎందుకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. 

>
మరిన్ని వార్తలు