ఖమ్మంవైపు తెలంగాణ రాజకీయాలు.. త్వరలో కొత్త పార్టీ?

10 Apr, 2023 11:42 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: రాష్ట్ర రాజకీయాలు ఖమ్మం వైపు చూస్తున్నాయి. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో వీరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డవారంతా ఏకమవుతారని పొంగులేటి కీలక వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తి నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారని పొలిటికల్‌ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మే నెలలో తెలంగాణలో కీలక పరిణాలు జరగబోతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గంతో పొంగులేటి ఆత్మీయ స​మ్మేళనాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలోని 9 నియోజక వర్గాల్లో ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఖమ్మం నియోజకవర్గం మాత్రమే మిగిలుంది. ఇక్కడ జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు లక్ష మంది పాల్గొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. 
చదవండి: బీఆర్‌ఎస్‌ కీలక నిర్ణయం.. పొంగులేటి, జూపల్లిపై వేటు

ఖమ్మం వేదిక ద్వారానే పార్టీ మార్పు, కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై పొంగులేటి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన అనుచరులు. ముఖ్యంగా జిల్లాలోని జనరల్‌ కేటగిరి స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి శ్రీనివాస రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావును సస్పెండ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ కార్యాలయం వెల్లడించింది.

మరిన్ని వార్తలు