Telangana: అక్కడ ముక్కోణపు పోటీ అనివార్యం

11 Aug, 2022 17:21 IST|Sakshi

నారాయణ్‌పేట నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యం కానుంది. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన రాజేందర్‌రెడ్డి తర్వాత గులాబీ దళంలో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగి విజయం సాధించారు. ఈసారి కూడా కారు గుర్తు మీద రాజేందర్‌ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్క్ చూపించారాయన. నారాయణపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయించగలిగారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడం ఆయనకు మైనస్‌ అంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం డీసీసీ చీఫ్‌గా, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న శివకుమార్‌రెడ్డి 2014లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో కారు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి..వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 

ఈ నియోజకవర్గంలో తొలినుంచీ బీజేపీకి కొంత పట్టుంది. బీజేపీ నేత రతంగ్‌పాండు రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో కూడా బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. సౌమ్యుడిగా పేరున్న రతంగ్‌పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్‌ నియోజకవర్గం ఓటర్లు ప్రతిసారీ భిన్నమైన తీర్పునిస్తున్నారు. బీజేపీ నేత డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కారు పార్టీలో చేరారు. 2018లో కూడా కారు గుర్తు మీద నెగ్గి...మూడోసారి గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషాతో పాటుగా..పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం, తెలంగాణ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ ఆసక్తి చూపిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెంకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే..తొలినుంచీ కేడర్ అండగా ఉన్నందున స్థానిక మున్సిపాలిటీని గెలుచుకోగలిగింది. అయితే  తొలినుంచీ పార్టీలో ఉండి రెండుసార్లు పోటీ చేసి ఓడిన కొండయ్యకు, కొత్తగా చేరిన జలంధర్‌రెడ్డికి పొసగడంలేదు. ప్రజాసంగ్రామ యాత్రలో కూడా ఇద్దరు పోటా పోటీగా బలప్రదర్శన చేశారు. సీటు విషయంలో ఇద్దరి మధ్యా  ఏకాభిప్రాయం వస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది. లేదంటే కారు పార్టీకే మేలు జరుగుతుంది.

నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టెం టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది. మాజీ జడ్‌పీటీసీ శ్రీహరి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్‌ ఎన్నిక ఈసారి రసవత్తరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్‌...కాంగ్రెస్‌లో చేరి 2018లో ఓడిపోయారు. తర్వాత మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పనుల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌తో కొట్లాడి చేయించారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను టార్గెట్ చేసి ఓడించారు. కొడంగల్‌లో రేవంత్‌ సోదరుడు పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవుతారనే ప్రచారం జరుగుతున్నందున కొడంగల్‌లో రేవంత్ విజయం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. 

కారు గుర్తు మీద గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి...పార్టీ నేతలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా నియోజకవర్గానికి చేసిన పనులు కూడా లేవు. కొడంగల్‌లో ఐదుసార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథరెడ్డి 2014లో కాంగ్రెస్‌  టిక్కెట్ ఇవ్వకపోవడంతో గులాబీ గూటికి చేరి పోటీ చేసి..రేవంత్ చేతిలో ఓడిపోయారు. గుర్నాథరెడ్డి ఇటీవల వైఎస్ విజయమ్మను కలవడంతో...వైఎస్‌ఆర్టీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఇక కొడంగల్‌ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి అద్వాన్నంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీకి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంత శక్తి  లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు