ఆ కేటాయింపులతో బీసీలకు బిస్కెట్లు కూడా రావు 

4 Feb, 2023 02:40 IST|Sakshi

కాచిగూడ(హైదరాబాద్‌): కేంద్రం ప్రవేశపెట్టిన రూ.45 లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి తీరని అన్యాయం చేసిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య విమర్మించారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు జబ్బాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రూ.2 వేల కోట్లతో దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు, చాక్లెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా దానిని సవరించి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎంత వ్యతిరేకంగా ఉందో బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతోందని, బీసీ వ్యతిరేక వైఖరిని బీజేపీ విడనాడకపోతే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జాతీయ బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారే కానీ, ఆర్థికపరమైన స్కీములను ప్రకటించడంలేదన్నారు. సమావేశంలో నీల వెంకటేశ్, గుజ్జ సత్యం, కోల జనార్దన్, భూపేష్‌ సాగర్, రాజ్‌కుమార్, సుధాకర్, నంద గోపాల్, వేముల రామకృష్ణ, బి.కృష్ణ, శివమ్మ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు